గుంటూరు తూర్పు టీడీపీలో సంక్షోభం

గుంటూరు తూర్పు టీడీపీలో సంక్షోభం

ఒక్కొక్కరుగా దూరం జరుగున్న నేతలు
 
నియోజకవర్గంలో సమన్వయ లోపమే టీడీపీకి శాపం
 
అతి విశ్వాసంతో  టీడీపీ అభ్యర్థి నసీర్ ఒంటెద్దు పోకడలు
 
కూటమిని వదిలి వైసీపీలో చేరిన జియా ఉర్ రెహమాన్
 
 'ముజీబ్ భాయ్' నిర్ణయంపై టీడీపీలో  టెన్షన్
 
టీడీపీ నగర అధ్యక్షుడి వర్గంలో సైతం అసంతృప్తి
 
ఎంపీ అభ్యర్థి గెలుపుపై సైతం తీవ్ర ప్రభావం
 
ఓటమి తప్పదనే ఆందోళనలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు
 
అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దాలని విన్నపాలు
 
 
పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలను చేజేతులారా జార విడుచుకొంటున్నదా అంటే... అవుననే సమాధానం ఇస్తున్నారు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు.
టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ తన గెలుపుపై అతివిశ్వాసంతో , ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గంలో తనకు సమాన స్థాయిలో ఉన్న నేతలను కలుపుకోనక పోవడం, వారి ప్రభావం లేకుండా దూరంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్న కారణంగా ఈ ఎన్నికల్లో టీడీపీకి మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగలనుందనే ఆందోళనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.
 
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ పడ్డారు. వీరిలో ఒక్కరు టీడీపీ టికెట్ దక్కించుకున్న నసీర్ అహ్మద్ కాగా, మరొకరు    సయ్యద్ ముజీబ్ ( ఇతని స్టానిక ప్రజలు ప్రేమతో భాయ్  అని పిలుస్తుంటారు) . ముస్లింలు టికెట్ కేటాయిస్తే ఈ ముజీబ్ కే టికెట్ కేటాయిస్తారని ఓ దశలో ప్రచారం తీవ్రంగా జరిగింది. ఇంకొక్కరు టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ( ఆర్థికంగా చాలా బలవంతుడు. కాపులో ఇతనికి బలమైన ఫాలోయింగ్ ఉంది. గుంటూరు నగరంలో కాపులను ఏక తాటిపై నడిపించే  సత్తా ఉన్న నాయకుడు గా పేరుంది).
 
అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో సయ్యద్ ముజీబ్, డేగల ప్రభాకర్ ను నసీర్ సమన్వయం చేసుకోకుండా వారి ఇద్దరిని  తనకు భవిష్యత్తు పోటీదారులుగా భావిస్తుండటం కారణంగా ఈ  నియోజకవర్గంలో మరోసారి టీడీపీ గెలుపు ప్రశ్నార్థకమైంది అంటున్నారు టీడీపీ శ్రేణులు.
 
నసీర్ కున్న రాజకీయ అభద్రతాభావమో లేదా రాజకీయ పరిణితి, చాకచక్యం లేకపోవడమో తెలియదు గాని.. ఉన్న నాయకులను కలుపుకొని పోవడం కానీ , ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను టీడీపీలోకి చేర్చుకొని పార్టీని బలోపేతం చేసే  ప్రయత్నం గాని  చేయలేదు అంటున్నారు.
 
వైసీపీలో చేరిన కీలక నాయకుడు
 
దీనికి తాజా  ఉదాహరణ గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ జియా ఉర్ రెహమాన్ గత రెండ్రోజులు ముందు కూటమిని వీడి వైసీపీలో చేరడమే  . 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన ముస్తాఫాకు 77,047 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నసీర్ అహ్మద్ కు 54956 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన జియా ఉర్ రెహమాన్ కు 21508 ఓట్లు వచ్చాయి.
 
వ్యాపారవేత్త అయిన జియా ఉర్ రెహమాన్ ఆర్ధికంగా స్థితిమంతుడు.  సేవ గుణం కలిగిన సౌమ్యుడిగా నియోజకవర్గంలో పేరుంది. తక్కువలో తక్కువ 5 నుంచి 7 వేల ఓట్లను ప్రభావితం చేయగలరు. ఆయనకు టీడీపీ-జనసేన కూటమిపై ఎటువంటి విముఖత , అసంతృప్తి కూడా లేదు. కేవలం నసీర్ ఆయనను సరైన రీతిలో సమన్వయం చేసుకుని, కలుపుకొని పోలేని కారణంగానే అంతటి కీలక నాయకుడు కూటమిని వదిలి వైసీపీలో చేరాల్సి వచ్చింది అని ఆయన వర్గీయులు బాహటంగానే విమర్శిస్తున్నారు. అయన కూటమి నుంచి వెళ్లిపోయేలా పొగబెట్టారు అంటున్నారు.
 
'ముజీబ్ భాయ్' కూడా పోతే టీడీపీ ఖాళీనే
 
సయ్యద్ ముజీబ్ భాయ్... నియోజకవర్గంలో టీడీపీ బలీయమైన నాయకుడు. అటు ఆర్ధికం గానూ, ఇటు అనుచరులు, ప్రజాదరణ పరం  గానూ బలవంతుడు. టీడీపీ టికెట్ భాయ్ కే ఇచ్చేందుకు ఓ దశలో అధిష్ఠానం మొగ్గుచూపింది.  కనీసం 15 శాతం ఓట్లను ప్రభావితం చేయగలిగే నాయకుడు. సొంత పార్టీకే చెందిన, తన ఇంటికి కూత వేటు దూరంలో ఉండే ఈ భాయ్ ను సమన్వయం చేసుకోవడంలో , కలుపుకొనిపోవడంలో కూడా టీడీపీ అభ్యర్ధి నసీర్ ఆసక్తి చూపించడం లేదని భాయ్  వర్గం ఆగ్రహంగా వుంది. ఇప్పటికే ఈ వర్గం స్తబ్దుగా ఉండేందుకు నిర్ణయానికి వస్తున్నారు.  జనసేన నాయకుడు జియా ఉర్ రెహమాన్ వైసీపీ చేరడంతో... భాయ్ అనుచరులు కూడా పార్టీ మారాలని, ప్రాధాన్యం లేని చోట మనమెందుకు ఉండడం అని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ముజీబ్ భాయ్ కు చంద్రబాబుతో, లోకేష్ తో  ఉన్న అనుబంధం కారణంగా ఆయన ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఆయన కనుక పార్టీని వీడితే గుంటూరు తూర్పులో టీడీపీ  ఘోర పరాజయం తప్పదు అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
 
నగర అధ్యక్షుడు తోనే సమన్వయం లేదు
 
డేగల ప్రభాకర్ ... గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడు.  నగర పరిధిలో అత్యంత ప్రభావశీలుడైన కాపు నాయకుడు. ఆర్దికంగా చాలా బలవంతుడు. ఇతనికి టికెట్ ఇస్తే సునాయసంగా , ఒంటి చేత్తో విజయం సాధించుకు రాగలిగిన సత్తా కలిగిన నాయకుడుగా... ఓ దశలో అభ్యర్థిత్వంపై తీవ్ర పరిశీలన జరిగింది. అయితే ముస్లింలకు టికెట్ కేటాయించాల్సి వచ్చింది. ఈ ప్రభాకర్ తో కూడా నసీర్ కు సమన్వయలోపం ఉంది. ఇతని కూడా కలుపుకొని పోవడం లేదంటున్నారు. దీనిపై ప్రభాకర్ అనుచరవర్గం తీవ్ర అసంతృప్తితో వుంది. అధిక శాతం అనుచరులు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారానికి దూరంగా  ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ప్రచారం నిర్వహించాల్సిన కార్యకర్తలు.. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. నసీర్ వ్యవహార శైలి కారణంగా ప్రభాకర్ కూడా అనుచరులకు సర్ధి చెప్పుకోలేక సతమతం అవుతున్నారు
 
దళితులోనూ అసంతృప్తే
 
తనకు సమాన స్థాయిలో ఉన్న సొంత పార్టీ, కూటమి  నాయకులకు కలుపుకుపోయి బలోపేతం కావాల్సిన నసీర్... వారిని తనకు పోటీదారులుగా భావించి, మనస్పూర్తిగా సమన్వయం చేసుకోలేక ఈ ఎన్నికల్లో తనను తాను బలహీనపర్చుకున్నారు . ఇది ఒక కోణమైతే.. తన పరిపక్వత లేని వ్యాఖ్యలతో తనకు తాను నష్టం చేకూర్చుకోవడంతో పాటు పక్క నియోజకవర్గాల్లో సైతం టీడీపీకి చేటు చేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు . ఎస్సీ , ఎస్టీలు తమకు ఓటేయరంటూ బహిరంగంగా ఆయన చేసిన  వ్యాఖ్య లు ఆ వర్గంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. గత మూడు రోజుల క్రితం నగరంలో ఇమ్మానియేల్ పేట పర్యటన లో నసీర్ ను అడ్డుకుని అక్కడి స్ఠానికులు నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో  వైరల్ అవుతోంది.
 
గుంటూరు ఎంపీ అభ్యర్థి పై ప్రభావం
 
2019 లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాలరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ 4205 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతోనే నెగ్గిన విషయాన్ని ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ వర్గీయులు గుర్తు చేసుకుంటున్నారు. జియా ఉర్ రెహమాన్  వైసీపీలోకి వెళ్ళడంతో కొంత ఓటు బ్యాంక్ పోగొట్టుకున్నామని, మరోవైపు సయ్యద్ ముజీబ్, డేగల ప్రభాకర్ వర్గీయులు స్థబ్దుగా ఉండడంతో  జరిగే నష్టం కూడా భారీగానే ఉంటుందని ఆందోళన చేందుతున్నారు.  ఎస్సీ, ఎస్టీ ఓట్లపై నసీర్ చేసిన వ్యాఖ్యలతో మరెంతో నష్టం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఆయన మునిగిపోవడంతో తమను కూడా ముంచేస్తున్నారు అని ఎంపీ అభ్యర్థి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?