పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు
- విశ్రాంత సెంట్రల్ జిఎస్టీ చీఫ్ కమిషనర్ సి.పి.రావు
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : రాజ్యాంగ బద్దంగా విశ్రాంత ఉద్యోగులకు కల్పించిన హక్కుల పరిరక్షణకు పెన్షనర్లందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని విశ్రాంత సెంట్రల్ జిఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్ లోని సన్ స్క్వేర్ హోటల్లో జరిగిన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్స్స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఆంధ్రప్రదేశ్ యూనిట్ 5 వ సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.పి.రావు మాట్లాడుతూ..పెన్షన్ పొందటం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నైతిక హక్కు అన్నారు. విశ్రాంత ఉద్యోగికి ఆధారమైన పెన్షన్ ను అందించటానికి, పెంచటానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాలని కోరారు. సీనియర్ సిటిజెన్స్ యైన పెన్షనర్స్ ను ప్రేమగా, గౌరవంగా చూడటం ప్రభుత్వాల బాధ్యత అన్నారు.
మరో అతిధి విశ్రాంత కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బి. హరేరామ్ మాట్లాడుతూ..విశ్రాంత ఉద్యోగులు సమాజంలో గౌరవంగా బతకటానికి బ్రిటిష్ ప్రభుత్వం 1871 సంవత్సరంలో పెన్షనర్ల చట్టం ద్వారా పెన్షన్ పధకాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేసారు. పెన్షనర్లు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చునన్నారు. సెంట్రల్ జిఎస్ కమిషనర్ సుజిత్ మల్లిక్ మాట్లాడుతూ..విశ్రాంత ఉద్యోగుల అనుభవాలే విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు మార్గదర్శకమన్నారు. పెన్షన్ పరంగా వారికి ఎటువంటి సమస్యలు లేకుండా తన వంతు కృషి చేస్తానన్నారు. పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గద్దె తిలక్, టి. వివేకానంద మాట్లాడుతూ.. 2025 ఆర్ధిక చట్టంలోని పెన్షన్ సవరణలు, పెన్షనర్ల పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అందుకు జాతీయ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీతొ చేతులు కలిపామన్నారు. 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేసారు. అనంతరం 75 ఏళ్ళు నిండిన పెన్షనర్స్ ను అతిధుల చేతుల మీదుగా సత్కరించారు. క్రీడలలో మెడల్స్ సాధిస్తున్న విశ్రాంత ఉద్యోగి కరాడే శివ ప్రసాదరావు కు జ్ఞాపికను అందించి సత్కరించారు. అలాగే గౌరవ అతిధులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సెంట్రల్ జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం. నాగరాజు, రవి కుమార్ పెన్షనర్ల సంఘ నాయకులు బి. రాజేశ్వరరావు, పి.వి. సత్యనారాయణ, గుమ్మడి సీతారామయ్య చౌదరి, పి. కోటేశ్వరరావు, ఎన్.ఎస్. నగేష్ బాబు, పి ఎన్ వి ప్రసాద్, పి.భాగ్యరావు, పి. భీమ్ ప్రసాద్, హుస్సేన్, ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.