స్వీయ పరిశీలన, స్వీయ అభివృద్ధికి ప్రతీక!
విజ్ఞాన్ లో ఉత్కంఠంగా సాగుతున్న చదరంగా పోటీ
కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్
నేటితో ముగియనున్న 62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : చదరంగం అనేది స్వీయపరిశీలన, స్వీయ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘‘62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు’’ ఘనంగా కొనసాగుతున్నాయి. పదో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముందుగా ఒక ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ చదరంగం ఆడటం వల్ల మన మెదడును పదును పెట్టుకోవడంతో పాటు సమస్య పరిష్కారంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవడం, ముందుగానే ప్రత్యర్థి ఆలోచనలను అంచనా వేయడం, అనుకోని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించడం వంటి గుణాలు మనలో పెరుగుతాయన్నారు. ఈ ఆట మనకు ‘ఒక కదలికకు పది ఫలితాలు‘ అనే దృక్పథాన్ని నేర్పుతుందన్నారు. మనకు మనమే సవాలు విసరుకోవడం, ప్రతిదాన్ని కొత్త కోణంలో చూడటం, ఎప్పటికప్పుడు మెరుగవ్వడం....ఈ ఆటలో నిజమైన విజయానికి మార్గమన్నారు. అందుకే చదరంగాన్ని బ్రెయిన్ గేమ్ అని కూడా అంటారని పేర్కొన్నారు. చదరంగం ఆటకు ప్రత్యేకత ఏమిటంటే, ఎవరితోనూ పోల్చుకునే అవసరం లేదు. ప్రతి ఆటగాడు తనకంటూ ప్రత్యేకమైన శైలి, తనదైన ఆలోచన విధానం కలిగి ఉంటాడని తెలియజేసారు. ‘‘ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనలోని ప్రతిభను పదును పెట్టుకోవాలి’’ ఇదే చదరంగం ఇచ్చే అసలు సందేశమన్నారు. ఈ ఆటలో నిజమైన విజయమంటే ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదని, మనలోని ఆలోచనా శక్తిని పెంచుకోవడమేనని అభిప్రాయపడ్డారు. చదరంగ బోర్డు ఒక ఆలోచనల రంగస్థలం, ప్రతి కదలిక ఒక సవాలు, ప్రతి నడక ఒక పాఠమన్నారు. చదరంగం ఆడినవారు ఏ రంగంలోనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రతికూలతలను ఎదుర్కొనే ధైర్యంలో, కొత్త మార్గాలు అన్వేషించే తత్వంలో ముందుంటారని పేర్కొన్నారు. ఇలాంటి విలువైన ఆటను చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ నేర్చుకోవాలన్నారు. మన మెదడును పదును పెట్టే చదరంగం మన రోజువారీ జీవితంలో కొత్త వెలుగులు నింపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి కదలికలో అప్రమత్తత అవసరం : ఏపీ నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్ లంకా రవి
చదరంగం అనేది ఒక మేధో క్రీడ మాత్రమే కాకుండా, అనేక గుణాలను, అనేక నైపుణ్యాలను నేర్పే వేదికని ఏపీ నుంచి మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్ లంకా రవి అన్నారు. ఇందులో అన్ని విషయాలపై దృష్టి కేంద్రీకరించడం, ఏకాగ్రతను పెంచుకోవడం అత్యంత అవసరమన్నారు. ఒక్క తప్పిదం చేసినా ఆట ఫలితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి.. ఆటగాడు ప్రతి కదలికలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. చదరంగం ఆడటం వలన వ్యూహాత్మక ఆలోచన, సహనం, శీఘ్ర నిర్ణయ సామర్థ్యం, సమస్యల పరిష్కార నైపుణ్యం వంటి లక్షణాలు ఆటగాడిలో సహజంగానే పెరుగుతాయన్నారు. ఈసారి జరుగుతున్న టోర్నమెంట్‌లో ఆటగాళ్లకు ఒక గొప్ప అవకాశమని, టాప్ సీడ్స్‌తో ఆడే అవకాశం వారికి దక్కడం చాలా గొప్ప విషయంగా చెప్పాలన్నారు. వారిని ఎదుర్కోవడం అంటే కేవలం ఆట ఆడటం మాత్రమే కాదు, వారి వ్యూహాలను నేర్చుకోవడం, అనుభవాన్ని సంపాదించడం, తమ ఆలోచనలకు కొత్త కోణాలు తెచ్చుకోవడమని అభిప్రాయపడ్డారు. టాప్ సీడ్స్‌ను ఎదుర్కొనే ఈ అవకాశం ఆటగాళ్ల కెరీర్‌లో ఒక మలుపుగా మారుతుందన్నారు. వారితో పోటీ పడటం ద్వారా, ఆటగాళ్లు తమ ప్రతిభను పరీక్షించుకోవచ్చు. అదే సమయంలో, ‘‘వారినుంచి నేర్చుకోవడం కూడా ఒక గెలుపు’’ అనే అనుభవాన్ని పొందవచ్చునని తెలియజేసారు. చదరంగం ఒక ఆట మాత్రమే కాదు, అది ఒక జీవన పాఠమని, ఏ ఆటగాడికైనా ఇలాంటి వేదికలు మహా అవకాశాలు, ఎందుకంటే ఇవే భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు తీసుకెళ్లే మెట్లు అని వెల్లడించారు. క్రీడాకారులకు ఎల్లప్పుడు ‘‘ఇంకా నేర్చుకోవాలి’’ అనే తపన ఉండాలన్నారు. ప్రతి గేమ్ ఒక కొత్త అనుభవం, ప్రతి తప్పు ఒక కొత్త పాఠమని, క్రీడాకారులు ఎప్పుడూ సంతృప్తి చెందకుండా, మరింత నేర్చుకోవాలనే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. 62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలు, ఇతర బోర్డులకు చెందిన క్రీడాకారులతో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.
+62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ – రౌండ్ 9 ఫలితాలు
గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ తొమ్మిదో రౌండ్‌లో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు, మాజీ జాతీయ చాంపియన్లు అంతా ఇంటర్నేషనల్ మాస్టర్ల చేతిలో ఓటమిపాలయ్యారు.
పీఎస్‌పీబీకి చెందిన జీఎం సశికిరణ్ కృష్ణన్ గెలుపు అవకాశాన్ని కోల్పోయినా 7.5 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన జీఎం ఇనియన్ పి.ఏ., కేరళకు చెందిన ఐఎం గౌతమ్ కృష్ణ హెచ్. లు కూడా అతనితో సమంగా లీడ్‌లో చేరారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో టైటిల్ పోరు రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా మారింది.
పీఎస్‌పీబీకి చెందిన టాప్ జీఎంలు సూర్యశేఖర్ గాంగూలీ, అభిజీత్ గుప్తా, ఎస్.పీ. సేతురామన్ వరుసగా గోవా ఐఎం రిట్విజ్ పరాబ్, కేరళ ఐఎం గౌతమ్ కృష్ణ, తమిళనాడు ఐఎం మనిష్ ఆంటో క్రిస్టియానో చేతిలో ఓడిపోయారు.
గియోకో పియానో గేమ్‌లో రిట్విజ్ పరాబ్, ఆరు సార్లు జాతీయ విజేత అయిన గాంగూలీపై అద్భుత విజయం సాధించాడు. రెండు పావులు కోల్పోయిన గాంగూలీ, చివరికి రిట్విజ్ క్వీన్ సాక్రిఫైస్ తో రెండో ర్యాంక్‌లో రెండు రూక్‌ల దాడి ఎదుర్కొని, 47 మూవ్‌లలో ఓడిపోయాడు.
క్వీన్స్ ఇండియన్ డిఫెన్స్ – కాస్పరోవ్ వెరీయేషన్ లో గౌతమ్ కృష్ణ, అభిజీత్ గుప్తాను ఎండ్‌గేమ్‌లో ఓడించాడు. ఒక చిన్న తప్పిదంతో అదనపు పావు సంపాదించిన గౌతమ్, కింగ్‌ను ప్రత్యర్థి క్యాంప్‌లోకి నడిపి, చివరికి అభిజీత్ క్వీన్ వదులుకోవాల్సి వచ్చింది.
టాప్ బోర్డులో జీఎం సశికిరణ్ – ఐఎం ఎలెక్ట్ అయుష్ శర్మ పోరు డ్రాగా ముగిసింది. చెక్‌మేట్ చేసే అవకాశం ఉన్నా సశి చేసిన చిన్న తప్పుతో స్థితి మారిపోయి డ్రాకు ఒప్పుకోవాల్సి వచ్చింది.
తమిళనాడు ఐఎం మనిష్ ఆంటో క్రిస్టియానో, పీఎస్‌పీబీ జీఎం సేతురామన్ ఆశలను పగలగొట్టాడు. వరుస తప్పిదాలతో సేతు తన పీస్‌లు కోల్పోగా, మనిష్ మూడు పీస్‌ల ఆధిక్యంతో ఘన విజయం సాధించాడు.
సిసిలియన్ డిఫెన్స్‌లోన నైడార్ఫ్ వెరీయేషన్ లో రైల్వేస్ ఐఎం ఉత్సబ్ చటర్జీ – తెలంగాణ ఐఎం ఎలెక్ట్ విగ్నేశ్ అద్వైత్ వేముల మధ్య ఉత్కంఠభరిత పోరు సాగి, చివరికి విగ్నేశ్ గెలిచాడు.
+ 9వ రౌండ్ ఫలితాలు వెల్లడి
అయుష్ శర్మ (రైల్వేస్) 7 – డ్రా – సశికిరణ్ కృష్ణన్ (పీఎస్‌పీబీ) 7½
అభిజీత్ గుప్తా (పీఎస్‌పీబీ) 7 – ఓటమి – గౌతమ్ కృష్ణ (కేరళ) 7½
ఇనియన్ పి.ఏ. (తమిళనాడు) 7½ – విజయం – దీపన్ చక్రవర్తి (రైల్వేస్) 6½
రిట్విజ్ పరాబ్ (గోవా) 7 – విజయం – సూర్యశేఖర్ గాంగూలీ (పీఎస్‌పీబీ) 6
సేతురామన్ ఎస్.పీ. (పీఎస్‌పీబీ) 6 – ఓటమి – మనిష్ ఆంటో క్రిస్టియానో (తమిళనాడు) 7
విగ్నేశ్ అద్వైత్ వేముల (తెలంగాణ) 7 – విజయం – ఉత్సబ్ చటర్జీ (రైల్వేస్) 6
రవి తేజ ఎస్. (ఆంధ్రప్రదేశ్) 7 – విజయం – రామకృష్ణ జె. (తెలంగాణ) 6
లలిత్ బాబు ఎం.ఆర్. (ఆంధ్రప్రదేశ్) 6½ – విజయం – జోయెల్ పాల్ గంటి (ఆంధ్రప్రదేశ్) 6
జైన్ కాశిష్ మనోజ్ (మహారాష్ట్ర) 7 – విజయం – శ్రేయాస్ సింగ్ (యూపీ) 6 ల ఫలితాలు వెల్లడించారు