అమ్మాయిల్లో ఎదిగే శక్తిని నూరిపోసే బాధ్యత తల్లిదండ్రులదే...

అమ్మాయిల్లో ఎదిగే శక్తిని నూరిపోసే బాధ్యత తల్లిదండ్రులదే...

-  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపు

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ, ఎదిగే శక్తిని నూరిపోసే బాధ్యత తల్లిదండ్రులదేనని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. కమ్మజన సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరిగిన 23వ తల్లిదండ్రుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల చదువు, ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించాలన్నారు.

ఆర్ధిక అవగాహన ఉండాలని, ఆర్ధిక స్వేచ్ఛ కలిగిన అమ్మాయిలు తమ జీవితాన్ని స్వయంగా నిర్ణయించుకునే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారని రాయపాటి శైలజ చెప్పారు. తల్లిదండ్రుల ఆదర్శాలు, ఆశయాలు నిలబెట్టే ఆడపిల్లనూ వారసురాలిగా సమాజం గుర్తించాలని ఆమె కోరారు. బాలికలకు చదువు అవసరంతో పాటు వారు ఎదిగిన తర్వాత ఆర్ధిక స్వేచ్ఛ ఉండాలన్నారు. ఇంటిలో ఆడపిల్లలతో తల్లిదండ్రులు కేటాయించే సమయం పెరగాలని, వారి ఆలోచనలను ఎప్పటికప్పుడు పంచుకున్నప్పుడే మూడో వ్యక్తుల ప్రమేయం తగ్గుతుందనేది అందరూ తెలుసుకోవాలన్నారు. శారీరక, మానసికంగా ధృఢంగా ఉన్నప్పుడే మహిళ అన్నిరంగాలలో ఎదగగలదని చెప్పారు. అమ్మాయిలు ఇళ్ళల్లో చిన్నచిన్న విషయాలకు కాకుండా తమ రక్షణకు, ఎదుగుదలకు మొండితనం చూపడంలో తప్పేమీలేదన్నారు. నేటి సమాజంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్ పరిచయాల పట్ల బాలికలు స్వయం నియంత్రణతో మెలగాలన్నారు. సోషల్ మీడియా ఎంత అవసరమో అంతే వాడుకోవాలని, శృతిమించితే సమస్యలు వస్తాయని రాయపాటి శైలజ హెచ్చరించారు.

బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే వారి చర్యలకు  భయపడి మానసిక వత్తిడికి గురికాకుండా తల్లిదండ్రుల సహకారం కోరాలని ఆమె పిలుపునిచ్చారు. కమ్మజన సేవాసమితి పాలకవర్గం తరఫున రాయపాటి శైలజకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ క్రిష్ణ, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, పారిశ్రామికవేత్తలు నూతక్కి రామకృష్ణ ప్రసాద్, చల్లా రాజేంద్రప్రసాద్, చుక్కపల్లి రమేష్, బౌద్ధ తత్త్వవేత్త డాక్టర్ మల్లెంపాటి సాంబశివరావు, కమ్మజన సేవాసమితి పాలకవర్గ సభ్యులు, వసతి గృహ విద్యార్ధినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author

Latest News