దసరా కి ఉద్యోగులకు నిరాశ – ప్రభుత్వం మొండి చెయ్యి
- ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురైందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కార్యాలయంలో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన, ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని తీవ్రంగా విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినప్పటికీ నాలుగు డీఏలు పెండింగులోనే ఉన్నాయని, కనీసం ఒక డీఏ కూడా విడుదల కాలేదన్నారు. విజయదశమి పర్వదినానైనా బకాయిల చెల్లింపుల గురించి స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకే 11వ వేతన సంఘం గడువు ముగిసి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అంతేకాక ఇప్పటివరకు ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించలేదని ఆయన అన్నారు.
చివరికి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్‌సీ కమిషన్ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదని చాంద్ బాష విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీపీఎస్, జీపీఎస్ అంశాలపై ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఉద్యోగుల సంక్షేమం విస్మరిస్తూ, ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వకుండా దశరా కాలంలో ఖాళీహస్తాలతో వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధ్యతలు గుర్తించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు చాంద్ బాష డిమాండ్ చేశారు.