టెట్ పై ప్రభుత్వం స్పందించాలి: ఎస్.జీ.టి.ఎఫ్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): అవసరమైన విద్యార్హతలతో, నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది సర్వీస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్.జీ.టి.ఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు కొక్కెరగడ్డ సత్యం ప్రభుత్వాన్ని కోరారు.
ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం కొత్తగా నియమించబడే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి చేసినప్పటికీ, ఇప్పటికే విధివిధానాల ప్రకారం నియమించబడి సేవలందిస్తున్న ఉపాధ్యాయులపై అదే నిబంధనను అమలు చేయడం అన్యాయం అవుతుందని పేర్కొన్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నంబర్ 1385/2025లో, సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు ప్రకారం, ఐదు సంవత్సరాల సర్వీస్ మాత్రమే మిగిలినవారిని తప్ప మిగతా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 2027 ఆగస్టు 31లోపు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. లేనిపక్షంలో ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు తలెత్తవచ్చని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఈ తీర్పుతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారిలో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ ఉత్తీర్ణత నుండి మినహాయించే దిశగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.