ఇంటర్ విద్యార్థులకు టీచర్లను నియమించాలి
- నాలుగు నెలలుగా వృక్ష,జంతు శాస్త్రాల బోధనకు టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
చల్లపల్లి (జర్నలిస్ట్ ఫైల్) : పురిటి గడ్డ ప్రభుత్వ హైస్కూల్ ప్లస్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వెంటనే టీచర్లను నియమించాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.పురిటిగడ్డ హైస్కూల్ ప్లస్ విద్యార్థులను సురేష్ బాబు కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పురిటిగడ్డ హై స్కూల్ ప్లస్ లో దాదాపు 20 మంది విద్యార్థులు బైపిసి గ్రూపులో ఉన్నారని,వారికి నాలుగు నెలలుగా బొటనీ, జువాలజీ బోధించడానికి టీచర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేటు కళాశాలలో ఫీజులు కట్టలేక ప్రభుత్వ హైస్కూల్ ప్లస్ లో చేరిన నిరుపేద విద్యార్థులకు బైపిసి లో ముఖ్యమైన సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు లేకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.బైపిసి ద్వారా వైద్య విద్య,ఇతర కోర్సులు చదువుదామని ఆశ పడి హై స్కూల్ ప్లస్ ద్వారా బైపీసీ గ్రూపులో చేరిన విద్యార్థుల భవిష్యత్ ఆలోచిస్తుంటే చాలా బాధ కలుగుతుందన్నారు.మెగా డిఎస్సీ ద్వారా పిజిటి పోస్టులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం లేదన్నారు.నిరుపేద విద్యార్థుల ఆశలను అడియాసలు చేయకుండా ప్రభుత్వం వెంటనే హైస్కూల్ ప్లస్ కు పూర్తి స్థాయిలో టీచర్లను కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.