ఆరెస్సెస్ పై షర్మిల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ఆరెస్సెస్ పై షర్మిల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, హిందువుల మనోభావాలతో షర్మిలమ్మ ఆటలాడుతున్నారని విమర్శించారు.

“దళితవాడల్లో దేవాలయాలు ఎవరు కట్టమన్నారంటూ షర్మిల మాట్లాడే మాటలకు అర్ధం ఉందా?” అని ప్రశ్నించిన ఆయన, ఇలాంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హిందువులపై ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్లే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని గుర్తుచేశారు.

ముస్లింలు మసీదులు, క్రైస్తవులు చర్చిలు కడితే మాట్లాడని షర్మిల, హిందూ దేవాలయాలపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. టీటిడి నిధులను దుబారా చేస్తున్నారని షర్మిల చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

“తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దళితవాడల్లో హిందూ దేవాలయాలు కట్టకూడదా? హిందువులు ముడుపులు వేసే నిధులతో దేవాలయాలు నిర్మించడం నేరమా?” అని ఆయన ప్రశ్నించారు. క్రైస్తవ మతాన్ని ఆచరించే షర్మిల హిందూ మతం గురించి మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు.

ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వానికి, హిందువుల ముడుపులతో సేవచేసే ధార్మిక సంస్థలకు తేడా తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఆరెస్సెస్ గురించి మాట్లాడే హక్కు షర్మిలకు లేదని ఆయన స్పష్టం చేశారు.

About The Author

Latest News