కూటమి కుట్రలు బద్ధలు కొడదాం
క్రైస్తవులకు వైసీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ పిలుపు
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : దేశంలోనే క్రైస్తవులను అన్ని రంగాలలో బలోపేతం చేయాలని సంకల్పించిన ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ కొనియాడారు. ఆ సంకల్పం ఆయన సీఎంగా ఉంటేనే సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రి చేసే దిశలో క్రైస్తవులంతా ఏక తాటిపైకి రావాలని ఆయన కోరారు. క్రైస్తవులు సంఘటితమై కూటమి కుట్రలు బద్దలు కొట్టాలని జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ విజయ్ ఆధ్యక్షతన బుధవారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రిస్టియన్ సెల్ జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్ వెస్లీ మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రైస్తవ వ్యతిరేక కూటమి ప్రభుత్వం రాజ్యమేలుతోందని పేర్కొన్నారు. క్రైస్తవులు అభివృద్ధి చెందడాన్ని కూటమి ప్రభుత్వం తట్టుకోలేదని తెలిపారు. అందుకే అన్ని రంగాలలో క్రైస్తవులను అణచివేతకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అణిచివేతలు - అవమానాలు తొలగి ఆత్మాభిమానం - ఆత్మగౌరవంతో బతకాలంటే.. వైయస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని స్థాయిల్లో పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేసి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన కోరారు.
క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పోలె ముత్యం మాట్లాడుతూ, నవరత్నాలతో నిరుపేద క్రైస్తవ కుటుంబాలలో ప్రగతి కాంతులు పూయించిన ఘనత వైయస్ జగన్‌కు మాత్రమే దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి మద్దు ప్రేమ్ జ్యోతిబాబు మాట్లాడుతూ, క్రైస్తవులంతా వైయస్ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసే ప్రార్థనా యోధులుగా మారాలని కోరారు.
జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ విజయ్ మాట్లాడుతూ, ఒక్క క్రైస్తవులకే కాక అణగారిన వర్గాలతో పాటు అగ్ర వర్ణాలకు చెందిన పేదలకు సైతం పెన్నిధిగా నిలిచిన సంక్షేమ చక్రవర్తి వైయస్ జగన్ అని కొనియాడారు. కార్పొరేటర్ పాపతోటి అంబేద్కర్ మాట్లాడుతూ, సమసమాజ నిర్మాణం, క్రైస్తవుల అభ్యున్నతి వైయస్ జగన్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్పొరేటర్ బూసి రాజలత మాట్లాడుతూ, క్రైస్తవుల బతుకులు బాగుపడాలన్నా.. క్రైస్తవ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నా.. వైయస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే ఏకైక మార్గమని వివరించారు.
సమావేశంలో న్యాయవాది డేవిడ్, బత్తుల దేవానంద్, మాదాసు భాగ్యారావు, జోయల్, ఆలా కిరణ్, జిల్లాలోని పలు నియోజకవర్గాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు దెబోరా, విక్టర్, దాసరి రాజా, విక్కీ తదితరులు పాల్గొన్నారు.