విద్యతోనే కురుబల ఉన్నతి సాధ్యం
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి
* సీఎం చంద్రబాబుతోనే కురుబలకు మేలు
* వచ్చే నెల 5న తిరుపతి భక్త కనకదాస విగ్రహావిష్కరణ : మంత్రి సవిత
* మంగళగిరిలో కురుబ, కురువ, కురుమ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఐక్యమత్యంతో కురుబలు మెలగాల్సిన అవసరముందన్నారు. అమరావతిలో భక్త కనకదాస విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మంగళగిరిలో ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన కురుబ, కురువ, కురుమ సామాజిక వర్గీయుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గీయుంతా ఒక్కటేనని, వారంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యతోనే పేదరికం దూరమవుతుందని, అన్ని రంగాల్లోనూ ఉన్నతి సాధ్యమవుతుందని తెలిపారు. కురుబ, కురుమ, కురువ పేద విద్యార్థులకు అండగా నిలుద్దామని, అందుకు తాను వ్యక్తిగతంగా ఎల్లవేళలా సాయమందిస్తానని తెలిపారు.
*అమరావతిలో కనకదాస విగ్రహం*
అమరావతిలో భక్త కనకదాస కాంస్య విగ్రహం ఏర్పాటు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇదే విషయమై సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుపైనా సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. వచ్చే నెల అయిదో తేదీన తిరుపతిలో భక్త కనకదాస కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నామని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
*చంద్రబాబుతోనే కురుబలకు మేలు*
సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే కురుబలకు ఎంతో మేలు కలుగుతోందని మంత్రి సవిత తెలిపారు. కురుబల రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉన్నతికి ఆయన ఎంతగానో వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. కురుబలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎంపీలుగానూ, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా సేవచేస్తున్నట్లు తెలిపారు. ఇదంతా సీఎం చంద్రబాబు వల్లేనన్నారు. గత ఎన్నికల్లో కురుబలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తానని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కురుబలను గెలిపించుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తిరుపతిలో వచ్చే నెల 5న జరిగే భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి సవిత ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, వివిధ జిల్లాలకు చెందిన కురుబ, కురుమ, కురువ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.