ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలి
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సుమన్, అసోసియేట్ అధ్యక్షుడు పి. శివ సైదారావు, ఉపాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్, హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కె. సుమన్ మాట్లాడుతూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని, కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 కాలంలో వేతనాలను 50 శాతం పెంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర ఉందని, అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని కోరారు.
ఆప్కాస్ లోపాలు సరిదిద్దాలి
ప్రస్తుతం అమల్లో ఉన్న ఆప్కాస్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి కమిటీ, సీఎస్ కమిటీలు 30 శాతం వేతనాలు పెంచాలని సిఫారసు చేసినా, కేవలం 23 శాతం మాత్రమే పెంచడం అన్యాయం చేశారని గుర్తు చేశారు.
హెచ్ఆర్ పాలసీ అవసరం
మెప్మా, స్పెర్స్ ఉద్యోగులకు మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పూర్తి కాలం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు సర్వీస్ రూల్స్ లేకపోవడం దురదృష్టకరమని, వీలైనంత త్వరగా నియమ నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇంక్రిమెంట్లు, సంక్షేమ పథకాలు
20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న సీనియర్లకు, కొత్తగా చేరిన వారికి ఒకే విధమైన జీతాలు ఇవ్వడం అన్యాయం అని, సీనియార్టీ ఆధారంగా ఇంక్రిమెంట్లు కల్పించాలని వారు కోరారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శివ సైదారావు, వైస్ ప్రెసిడెంట్ గంట సంపత్ కుమార్, కోశాధికారి రమణమూర్తి, నాయకులు నాగరాజు, రాముడు, పేరయ్య, నీలాద్రి, పుల్లయ్య, సుధా, లక్ష్మీదేవి, సరోజమ్మ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.