యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం

యువత భవితకు చేయూతనిచ్చిన ఘనత జగన్ సొంతం

- ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి 

గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో యువత భవితకు చేయూత అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంతమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగు నెలల కాలంలోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే అందుకు నిదర్శనమని ఆయన వివరించారు. తద్వారా దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించడమే కాక రాష్ట్రంలో నిరుద్యోగ రక్కసిని తరిమికొట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన వాస్తవం అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడుగా నియమితులైన కానూరు శశి బుధవారం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి శశికి శాలువా కప్పి అభినందించారు. పశ్చిమ నియోజకవర్గంలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని భుజం తట్టి ప్రోత్సహించారు.

అనంతరం ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, 2019 ఆగస్టు 15వ తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా అక్షరాలా 2,66,796 కొత్త ఉద్యోగాలను సృష్టించిన యువజన పక్షపాతి జగన్ అని కొనియాడారు. సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఇదే రోజున (2019 అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నాడు) సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడం ద్వారా 1,28,858 మంది నిరుద్యోగ యువతకు నాటి వైయస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చిందని గుర్తు చేశారు.

ఇక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలనెలా నిరుద్యోగ భృతి ఇస్తా.. అని నమ్మకంగా చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా జగనన్న ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఊడబీకేశారని లేళ్ళ అప్పిరెడ్డి ఆరోపించారు. తాను సీఎం అయిన వెంటనే జీతం పెంచుతానని ఆశపెట్టి, ముఖ్యమంత్రి కాగానే వాలంటీర్లను పీకి పారేశారని విమర్శించారు. ఇంకా ఇంటింటికీ తిరిగి రేషన్ ఇచ్చే వారిని, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్‌మెంట్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను కూడా ఊడబీకి వేలాది మంది యువతను బలవంతంగా నిరుద్యోగ ఊబిలోకి నెట్టారని నిందించారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నిజస్వరూపం గురించి యువతీ యువకులందరికీ తెలియజెప్పి, వారిలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాల్సిన బాధ్యత వైసీపీ యువజన విభాగం నేతలపైనే ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు చేసిన మోసం, జగన్ హయాంలో చేకూరిన ప్రయోజనంపై అందరిలో అవగాహన పెంపొందించాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

About The Author

Latest News