ఓర్పు, దృష్టి, మేధస్సు కలయికే చదరంగం
మనం గడిపే ప్రతి క్షణం విలువైనదే
ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోనేరు హంపి
విజ్ఞాన్స్ వర్సిటీలో ఘనంగా కొనసాగుతున్న 62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్)
చెస్ ఆటలో మనం గడిపే ప్రతి క్షణం విలువైనదేనని ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోనేరు హంపి అన్నారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘‘62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు’’ ఘనంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోనేరు హంపితో విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ ముందుగా ఒక ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోనేరు హంపి మాట్లాడుతూ చెస్ క్రీడాకారులందరికీ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఒక గొప్ప వేదికని తెలియజేసారు. దేశం నలుమూలల నుండి వచ్చే క్రీడాకారులతో ఆడే అవకాశం ద్వారా, అనుభవాన్ని పెంపొందించుకునే అవకాశం లభిస్తుందన్నారు. అయితే, ఆటలో కొన్నిసార్లు ఆటంకాలు, విఫలాలు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం చాలా ముఖ్యమన్నారు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ, ఎప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలన్నారు. నిరంతర అభ్యాసం, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయాలు మన సొంతమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. కోచ్ చెప్పే సూచనలపై నమ్మకం ఉంచాలని, ఆయన తప్పులు సరిచేసి, సరైన మార్గంలో నడిపిస్తారని తెలిపారు. ఆటలోని ప్రతి అనుభవాన్ని పాఠంగా తీసుకొని ముందుకు సాగితేనే నిజమైన క్రీడాకారుడిగా ఎదగవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రతి గేమ్ ఒక కొత్త అనుభవం, ప్రతి తప్పు ఒక కొత్త పాఠమని, క్రీడాకారులు ఎప్పుడూ సంతృప్తి చెందకుండా, మరింత నేర్చుకోవాలనే ప్రయత్నం చేయాలన్నారు. ‘‘నెరవేర్చాం’’ అనుకోవడం కంటే ‘‘ఇంకా నేర్చుకోవాలి’’ అనే తపన ఉండాలన్నారు.
ఓర్పు, దృష్టి, మేధస్సుల కలయిక : ఆలిండియా చెస్ ఫెడరేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏకే వర్మ
చెస్ అనేది ఆలోచన, ఓర్పు, దృష్టి, మేధస్సుల కలయికని ఆలిండియా చెస్ ఫెడరేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏకే వర్మ అన్నారు. ఈ ఆటలో ప్రతి క్రీడాకారుడు తన ప్రతిభను నిరూపించుకోవడానికి, తన ప్రతిభను మరింతగా మెరుగుపరచుకోవడానికి ఇలాంటి వేదికలు అవసరమన్నారు. ఈ టోర్నమెంట్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, ప్రతి క్రీడాకారుడికి ఒక పాఠశాల వంటిది. అనుభవం, క్రమశిక్షణ, పట్టుదల, పాజిటివ్ థింకింగ్ – ఇవన్నీ కలిసినప్పుడే ఆటగాడు నిజమైన విజయాన్ని సాధించగలడని పేర్కొన్నారు.
ముందుగానే అంచనా వేసి ఎదుర్కోవాలి : విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
చెస్ బోర్డులో ఒక గేమ్ గెలవడానికి మనం మన ప్రణాళికను అమలు చేయడంతో పాటు, ప్రత్యర్థి ప్రణాళికను కూడా ముందుగానే అంచనా వేసి ఎదుర్కోవాలని విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ అన్నారు. చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఆలోచనల పోరాటమని పేర్కొన్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో మాత్రమే కాకుండా, ప్రత్యర్థి ఎలా ఆలోచిస్తున్నాడు అన్నది కూడా అర్థం చేసుకోవాలన్నారు. అదే విజయానికి మూలమని తెలియజేసారు. చెస్ ఎప్పుడూ చదరపు బోర్డు రూపంలోనే ఎందుకు ఉంటుంది? ఎందుకు దీన్ని దీర్ఘచతురస్రం రూపంలో ఆడకూడదు? అనేది కూడా ఒక ఆలోచనీయమైన ప్రశ్న అని పేర్కొన్నారు. చదరపు గడులు ఉండడం వల్ల ప్రతి పావు అన్ని దిశల్లో సమన్యాయం కలిగిన కదలికలు చేయగలుగుతుందన్నారు. అదే దీర్ఘచతురస్ర బోర్డు అయితే ఆటలో అసమానతలు రావచ్చునని వెల్లడించారు. అందుకే చెస్ ఆట అనేది మన మానసిక సామర్థ్యాన్ని విస్తరింపజేసే గొప్ప శాస్త్రమన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. 62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులతో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.
62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ 7.వ.రౌండ్ ఫలితాలు
గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్ ముగిసే సరికి, తొలి ఆరు బోర్డులలో నిర్ణయాత్మక ఫలితాలు రాకపోవడంతో ఆధిక్యంలో మార్పు లేకుండా నిలిచింది. ఇప్పటివరకు 6 పాయింట్లు సాధించిన పీఎస్‌పీబీకి చెందిన గ్రాండ్‌మాస్టర్స్ సశికిరణ్, అభిజీత్ గుప్తా, రైల్వేస్ ఐఎం అరోన్యక్ ఘోష్, ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డి లీడ్‌ను కొనసాగించారు. వీరితో పాటు విజయాలు సాధించిన పీఎస్‌పీబీకి చెందిన జీఎం దీప్ సెంగుప్తా, రైల్వేస్ ఐఎం అయుష్ శర్మ, తమిళనాడుకు చెందిన ఐఎం హర్ష్ సురేష్ కూడా 6 పాయింట్ల క్లబ్‌లో చేరారు.
అభిజీత్ క్వీన్స్ గాంబిట్ ఓపెనింగ్‌ను సశికిరణ్ తిరస్కరించగా, గ్-ఫైల్ లో మూడు పావులు ఉన్నా పెద్దగా సమస్య లేకుండా 31 మువ్స్ తరువాత డ్రాకు ఒప్పుకున్నాడు. ఇదే విధంగా అరోన్యక్ – అజయ్ ఇంగ్లీష్ ఓపెనింగ్ లో రిస్క్ తీసేందుకు వెనుకంజ వేశారు. 20వ మువ్ లో మూడు సార్లు పునరావృతం అవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాప్ సీడ్ పి.ఇనియన్ (తమిళనాడు) – హెచ్.గౌతమ్ కృష్ణ (కేరళ) మధ్య పోటీ కూడా డ్రాగా ముగిసింది. మహారాష్ట్రకు చెందిన కాశిష్ మనోజ్ జైన్ తో ఆడిన జీఎం సూర్యశేఖర్ గాంగూలీ కూడా క్లిష్టమైన స్థితిలో విజయం సాధించలేక డ్రా చేశాడు.
టాప్ బోర్డులలో మొదటి నిర్ణయాత్మక విజయం జీఎం దీప్ సెంగుప్తా పేరున నిలిచింది. రైల్వేస్ ఐఎం సిద్ధాంత్ మోహాపాత్రపై ఫ్రెంచ్ డిఫెన్స్ ఆడి, 14వ మువ్ లోనే క్వీన్స్ ఎక్స్చేంజ్ చేశారు. దీప్ తన సెంటర్ పావు శక్తిని చక్కగా వినియోగించి 48వ మువ్ లో గెలుపు నమోదు చేశాడు.
గత రౌండ్‌లో ఐఎంను ఓడించిన తమిళనాడు మాజీ ఛాంపియన్ ఎన్. సురేంద్రన్ ఈసారి తెలంగాణ జీఎం ప్రణీత్ వుప్పాలపై ఘన విజయం సాధించాడు. సిసిలియన్ డిఫెన్స్ లో మధ్యభాగంలో క్వీన్ సాక్రిఫైస్ చేసిన ప్రణీత్ తరువాతి మువ్‌లో తప్పిదం చేయడంతో సురేంద్రన్ రుక్ సాక్రిఫైస్ చేసి క్వీన్ ప్రమోషన్ సాధించాడు. దీంతో గ్రాండ్‌మాస్టర్ ఓటమి అంగీకరించాల్సి వచ్చింది.
రైల్వేస్ జీఎం వినయేష్ ఎన్.ఆర్. ను ఆంధ్రకు చెందిన శ్రవ్యశ్రీ భీమరాసెట్టి సంచలన విజయం నమోదు చేసింది. రూయ్ లోపెజ్ గేమ్ లో కాస్త ఆధిక్యం ఉన్నా క్వీన్ పొరపాటుతో విన్నేశ్ గేమ్ వదులుకోవాల్సి వచ్చింది.రైల్వేస్ ఐఎం సుభయాన్ కుందు తో సమంగా సాగిన రుక్–పావుల ఎండ్‌గేమ్ లో హర్ష్ సురేష్ కచ్చితమైన నైపుణ్యంతో గెలుపొందాడు. అయితే మరో తమిళనాడు ఐఎం మనీష్ ఆంటో క్రిస్టియానో మాత్రం విఫలమై, ఎం.పీ కి చెందిన అయుష్ శర్మ చేతిలో ఓడిపోయాడు.