ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు

ఉద్యోగులను నిరాశపరిచిన అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు, నల్లపల్లి విజయ్ భాస్కర్

  ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై  అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ఆమోదయోగ్యమైన పరిష్కారం దక్కుతుందని ఎదురుచూసిన ఉద్యోగులందరికీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశ మిగిల్చాయని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆవేదన వ్యక్తం చేసారు. 
ఈ సందర్బంగా నల్లపల్లి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యాలల్లో కనీసం రెండు అయినా ఇస్తారని, 12వ పిఆర్సి కమిషన్ నియమించి ఉద్యోగులందరికీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటిస్తారని  ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు.

అసెంబ్లీ లో ప్రకటించిన ఉద్యోగుల కరువుభత్యం మరియు 11 వ పిఆర్సీ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారో నిర్ణయం చెప్పకపోవడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ  సంక్షేమ పథకాలను ఎన్నో వొత్తిళ్లను అధిగమించి ప్రజలకు చేరవేస్తున్న ఉద్యోగుల ఆర్థిక అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 27000 కోట్ల ఆర్థిక బకాయిలలో ప్రస్తుత ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు దశల వారీగా బకాయిలు చెల్లించినప్పటికీ ఇంకా చాలా బకాయిలు అయిన గ్రాట్యూటీ,  సరెండర్ లీవులు, పి.ఎఫ్, ఏపీ జి ఎల్ ఐ, మెడికల్ బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యం అయిన పెన్షన్ పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు పాత పెన్షన్ అమలు పై నిర్ణయం ప్రకటించక పోవడం వల్ల ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.

రిఫరెన్స్ ఆసుపత్రులు ప్యాకేజి రేట్లు సరిగ్గా లేవని ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ ఉన్నప్పటికీ వైద్యం అందడం లేదని అన్నారు.  సమగ్ర శిక్ష లో పనిచేసే ఉద్యోగులకు ఒకటిన్నర నెల జీతం పెండింగ్ లో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న  కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయక పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వీళ్లందరికీ సంక్షేమ పథకాలు అమలు అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

About The Author

Latest News