ఉద్యోగుల ‘సూపర్ సిక్స్’ హక్కులను వెంటనే అమలు చేయాలి
– జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘సూపర్ సిక్స్’ ఆరు హక్కులను తక్షణమే అమలు చేయాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ చాంద్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని, అదే విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కూడా ‘సూపర్ సిక్స్’ హక్కులను అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ వేతన సవరణ కమిటీని వెంటనే నియమించాలని, ఇంటిరిమ్ రిలీఫ్ (IR) ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలన్నారు.
అంతేకాకుండా ₹30 వేల కోట్ల పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఉపాధ్యాయులు మరియు వైద్యశాఖ ఉద్యోగులపై ఉన్న యాప్ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరు అంశాలను అమలు చేస్తేనే ప్రభుత్వం నిజమైన ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాద్రి, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, తాలూకా యూనిట్ అధ్యక్షుడు సుబ్బారావు, తాడికొండ నాయకులు తదితరులు పాల్గొన్నారు.