పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి

పీహెచ్సీ వైద్యులు ఆందోళనలను నిలిపి, వెంటనే విధుల్లో చేరాలి – ప్రభుత్వం విజ్ఞప్తి

అమరావతి( జర్నలిస్ట్ ఫైల్ ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీలు) పనిచేసే వైద్యులు పీజీ ఇన్-సర్వీస్ కోటా సంబంధిత సమస్యలపై ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం బోధనాసుపత్రులు, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్సీలకు పంపేలా ఆదేశాలు జారీ చేసింది.

సోమవారం రాత్రి విడుదలైన ఆదేశాల ప్రకారం, బోధనాసుపత్రుల్లో ఉన్న 1,014 మంది పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు, ఎంబీబీఎస్ ట్యూటర్లు, అలాగే సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 1,017 మంది ఎంబీబీఎస్ వైద్యులను మాప్ చేసి, మంగళవారం నుంచి విధుల్లో నియమిస్తారు. ఈ చర్య ద్వారా రోగులకు యథావిధిగా సేవలు అందుతాయని ప్రభుత్వం తెలిపింది.

సహేతుకం లేదు
పీహెచ్సీ వైద్యుల ఆందోళనలు సమంజసం కాదని కమిషనర్ వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో వచ్చే ఖాళీలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇన్-సర్వీస్ కోటా సీట్లను కేటాయించింది. ఇటీవల విడుదల చేసిన జీఎో ప్రకారం 15% క్లినికల్ (7 స్పెషాల్టీలు), 30% నాన్-క్లినికల్ సీట్లు కేటాయించబడ్డాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు వెయ్యి మంది ఇన్-సర్వీస్ పీజీలు విధుల్లో చేరనున్నారు.

సెలవులు లేవు
పీహెచ్సీల్లో పనిచేసే ఇతర సిబ్బంది సెలవులు వదిలి, అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లోనే ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండి, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించింది. 108 అంబులెన్స్ సిబ్బంది స్థానిక ఆసుపత్రులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది.

About The Author

Latest News