ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

-ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
 
 

విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ సిబ్బందిపై ఆన్‌డ్యూటీ సమయంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ పిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావుకి గురువారం లేఖ సమర్పించినట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో స్త్రీశక్తి పథకం విజయానికి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బంది కీలకపాత్ర పోషించారని ప్రశంసించినప్పటికీ, అదే సిబ్బందిపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

స్త్రీశక్తి పథకం అమలులో తక్కువ బస్సులతో 100–150 మంది వరకు ప్రయాణికులు ఎక్కడం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో కొంతమంది అల్లరి మూకలు, తాగుబోతులు సిబ్బందిపై దూషణలు, దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని అన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ సూచించింది.

ఈ మేరకు లేఖలో పలు సూచనలు చేశారు. సిబ్బందిపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కూటమి నాయకులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని, ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని పిలుపునివ్వాలని కోరారు. బస్సులలో, బస్టాండ్లలో దాడులు చేసిన వారిపై తీసుకునే చర్యల గురించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్త్రీశక్తి బస్సుల్లో ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపడం సాధ్యం కాదని, కేవలం బస్ స్టాప్‌లలోనే ప్రయాణికులు ఎక్కేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రయాణికులు టిక్కెట్టుల కోసం సరిపడా చిల్లర తెచ్చుకోవాలని, ఉచిత ప్రయాణికులు ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్త్రీశక్తి పథకం మరింత సమర్థవంతంగా అమలవ్వాలంటే కొత్త బస్సులను పెంచి, తగిన సిబ్బంది నియామకాలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బస్సుల సంఖ్య పెంచకపోతే, సిబ్బంది పనిభారం వేసవి కాలంలో అధికమై అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, దీంతో స్త్రీశక్తి పథకానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజల సౌకర్యం కోసం పనిచేస్తున్నారని, వారిని రక్షించడం సంస్థ, ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా స్త్రీశక్తి పథకం మరింత విజయవంతం అవుతుందని ఇ.యు నాయకులు పలిశెట్టి దామోదరరావు, జి.వి.నరసయ్య అభిప్రాయపడ్డారు.

 

About The Author

Latest News