ప్రభుత్వ ఉద్యోగులు ఏ పాపం చేసుకున్నారు ?
అందరికీ అన్ని ఇస్తున్నారు... మా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఆపాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ అన్నీ ఇస్తున్నారు... “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు, మహిళలు, విద్యార్థులు, పింఛనుదారులు అందరికీ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజల భాగమే. మా పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.
12వ వేతన సవరణ కమిటీని ఇంకా ఏర్పాటు చేయకపోవడం, గత పీఆర్సీ గడువు ముగిసి 26 నెలలు గడిచినా ఇన్టెరిమ్ రిలీఫ్ (IR) ప్రకటించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీపీఎస్ వ్యవస్థపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం పట్ల కూడా విమర్శలు గుప్పించారు.
“ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఇక నిర్లక్ష్యం చేయకండి. అక్టోబర్ 10న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 28 శాతం ఐఆర్ (IR) ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను గౌరవించాలని” ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చాంద్ బాష కోరారు.