ఈ నెల 10 తేదీనుండి బోధనేతర పనులు బహిష్కరణ
-కర్నూలు జిల్లా ఫ్యాప్టో
కర్నూలు ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్ర ఫ్యాప్టో నిర్ణయం ప్రకారం అక్టోబర్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బోధనేతర మరియు విద్యాశక్తి కార్యక్రమాలను ఉపాధ్యాయులు బహిష్కరించనున్నారు. కర్నూలు జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్‌లకు వినతి పత్రాలు సమర్పించబడినట్లు తెలిపారు.
ఫ్యాప్టో నాయకుల ప్రకారం రేపటి నుండి కర్నూలు జిల్లా లోని అన్ని పాఠశాలల్లో హాజరు నమోదు మరియు విద్యార్థుల భోజన పథకానికి సంబంధించిన ఆన్లైన్ పనులు తప్ప మిగతా బోధనేతర పనులను పూర్తి బహిష్కరిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించటానికి కృషి చేస్తామని, గూగుల్ షీట్ సమాచారం పంపడం, ఆన్లైన్ సమావేశాలు, ఇతర బోధనేతర పనులను అన్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నవీన్ పాటిల్ (యు టి ఎఫ్), గోకారి (ఎస్ టి యు), జనార్ధన్ (ఎస్ టి యు), మరియానందం (ఎ పి టి ఎఫ్ 1938), మధుసూదన్ రెడ్డి (అప్టా), హుస్సేన్ (ప్రధానోపాధ్యాయ సంఘం), నందీశ్వరుడు (బి టి ఎ), రోశన్న (డి టి ఎఫ్) మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఫ్యాప్టో నేతల చర్యలను జిల్లా అధికారులు స్వీకరించి, ఉపాధ్యాయులు బహిష్కరణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు.