ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం

ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమం

వైద్య కళాశాలల ప్రై'వేటు'కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి


గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్)  : పేదలకు ఎంతగానో ఉపయోగపడే వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ప్రభుత్వ రంగంలో పూర్తి కార్పొరేట్ హంగులతో ఏర్పాటయ్యే బోధనాసునత్రులకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతుందని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు కీడు చేసే వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వ కూసాలు కదిలిస్తామని ఆయన హెచ్చరించారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి శనివారం గుంటూరులో శ్రీకారం చుట్టారు. తొలుత తాను స్వయంగా సంతకం పెట్టి తర్వాత ప్రజలతో దగ్గరుండి మరీ సంతకాలు చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, అవనిలోని దేవతలు - వైద్యులు! ఆధునిక దేవాలయాలు - వైద్య కళాశాలలు‌‌!! అందుకే ప్రజలకు కనిపించే ప్రత్యక్ష దేవుళ్ళైన వైద్యులను ప్రభుత్వ రంగం ద్వారా పెద్ద సంఖ్యలో తయారు చేసి తద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ 8,500 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు. తద్వారా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ద్వారా పేద విద్యార్థులను సైతం ప్రాణం పోసే వైద్యులుగా తీర్చిదిద్దాలని ఆయన తలపోశారు. మరోవైపు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పడే బోధనాసుపత్రుల వలన లక్షలాది మంది పేద వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుందని ఆయన వివరించారు. అయితే.. పేద విద్యార్ధులు కనీసం ఇంగ్లీష్ మీడియంలో చదవడమే పాపంగా భావించే పెత్తందారీ పోకడలు గల ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - పేదలు డాక్టర్లు కావడాన్ని తట్టుకోగలరా...? పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా పొందుతుంటే భరించగలరా..‌? అని ఆయన ప్రశ్నించారు. ఎంత మాత్రం తట్టుకోలేరు కనుకనే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పన్నాగం పన్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ నవంబరు 22 వరకు కార్యాచరణ నిర్దేశించినట్లు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు. దాని ప్రకారం గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ పెట్టి అన్నింటిపై ప్రజల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. అక్టోబరు 28వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
నవంబరు 12న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, ప్రతి గ్రామం నుంచి 500 సంతకాల చొప్పున ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి సంతకాలు సేకరించి ఆ ప్రతులను రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించడం జరుగుతుందని ఆయన వివరించారు. పేద ప్రజలకు శాపంగా మారిన ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వం పట్ల తమ వ్యతిరేకతని ఎలుగెత్తి చాటాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), పాపతోటి అంబేద్కర్, గీతా మందిరం ఛైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News