రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల

రాష్ట్ర ఆయుష్ శాఖకు కేంద్రం రూ. 166 కోట్లు విడుదల


•    దర్మవరం, కాకినాడలలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు 
•    ఆయుష్ డిపార్ట్మెంట్ కు కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట

-    వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ 


విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) :భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖ ను పటిష్ట పరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం  శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు..శుక్రవారం స్ధానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్స్ స్టైఫండ్స్ పెంచినందుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం చేశారు.. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయుష్ శాఖను ఆదర్శంగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్ధుల పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ ను పెంచిందన్నారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం రూ. 166 కోట్లు మంజూరు చేసిందన్నారు.. దర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు మంజూరు చేశామన్నారు.. 

గత ప్రభుత్వం ఆయుష్ శాఖను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కేంద్రానికి పంపించాల్సిన నివేదికలను పంపక పోవడం వల్ల మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఆయుష్ శాఖకు కేటాయింపు జరగలేదన్నారు.  ఎంతో ప్రాచీనమైన మన భారతీయ ఆయుష్, యునాని తదితర వైద్య విధానాలను సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.. భావితరాలకు దీని విశిష్టతను తెలియపరిచే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.. ఆయుష్ ప్రాధాన్యతను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి దీనికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆయుష్ లో భాగమైన యోగా, ప్రాణా యామం వంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం  కల్పించారన్నారు.. 

రాష్ట్రంలో కొత్తగా ఆయుష్ శాఖకు చెందిన ఐదు ఆస్పత్రులను, మూడు కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.. ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్టపరిచే విధంగా బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది మొత్తం కలిపి 500 పోస్టుల నియామకాలు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ ఆయుర్వేద కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆయుర్వేద కళాశాలలు  విశాఖపట్నం, కాకినాడ లలో  మంజూరు చేయడం జరిగిందన్నారు.. గత ప్రభుత్వం పూర్తి గా ఆయుష్ శాఖను నిర్వీర్యం చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే మొదటి ఏడాది రూ. 83 కోట్లు, రెండో ఏడాది 166 కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో 2018 లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్  యోగా అండ్ నేచురోపతికి భూమిని కేటాయించగా, గత ప్రభుత్వం ఆ స్థలాన్ని వేరే యాక్టివిటీస్ కి ఇచ్చారని, అది కూడా నెరవేరలేదన్నారు. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థను గత ప్రభుత్వం రాష్ట్రానికి రానివ్వకుండా చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతమైన ప్రత్తిపాడులో ఆ సంస్ధకు భూమిని కేటాయించి, రాబోయే 2 సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేసి  అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనివల్ల ఆయుష్ లో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి వచ్చి అధునాతనమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. 

ఆయుష్ శాఖ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పీజీ విద్యార్ధుల స్టైఫండ్ ను పెంచి రికార్డు సృష్టించారన్నారు. గతంతో పోల్చుకుంటే ఆయుష్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. వైద్య విద్యార్ధులు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాకాన్ని అందిపుచ్చుకుని మందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ పి. సాయి సుధాకర్, డాక్టర్ నోరి రామ శాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ కె. నిర్మలా జ్యోతి బాయ్, ఆయుర్వేద కళాశాల కు చెందిన పీజీ, హౌస్ సర్జన్స్ పాల్గొన్నారు..

WhatsApp Image 2025-10-10 at 3.56.25 PM

About The Author

Latest News