సొనాటా సాఫ్ట్‌వేర్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో జీసీసీ హబ్‌గా మారిన హైదరాబాద్
హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలోని గ్లోబల్ కెప్టివ్ సెంటర్లకు (జీసీసీ) హబ్‌గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్‌రాంగూడలో సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి ధరిశెట్టి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘సోనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ ప్రారంభం తెలంగాణకు గర్వకారణం. సంస్థ యాజమాన్యం, ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని ‘ఎఐ రెడీ’గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎఐతో పర్యావరణ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణను వరిస్తుండగా, లక్షకుపైగా ఉద్యోగాలు సృష్టించాం. తయారీ, డేటా సెంటర్లు, నూతన పారిశ్రామిక రంగాల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది,’’ అని పేర్కొన్నారు.
ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతుండటం సంతృప్తికరమని సీఎం స్పష్టం చేశారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలన్నదే లక్ష్యమని, అందరి సహకారంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.