ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు కఠారి దత్తప్రసాద్ సాగర్ అధ్యక్షత వహించగా, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలనలో దేశాన్ని 'వికసిత భారత్' దిశగా విజయవంతంగా నడిపించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా దేశ అభివృద్ధికి కొత్త దిశ లభించిందన్నారు.
నడింపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.94 కోట్ల వ్యయంతో వంద పడకల సామర్థ్యంతో నిర్మించబోయే ఆయుష్ హాస్పిటల్ ప్రాజెక్టును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ హాస్పిటల్ ద్వారా సుమారు 150 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. హాస్పిటల్ సిబ్బందికి వసతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, గుంటూరు జిల్లాలో అమలవుతున్న కేంద్ర పథకాలను ప్రజలకు సమగ్రంగా తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రత్తిపాడు మండల ఉపాధ్యక్షులు మట్టా వెంకటేశ్వర్లు, మండల నాయకులు పాపన్న వెంకటశివ, తణుకు వసంతకుమారి, గుంటుపల్లి తులసీరామ్, బాపతు రమణారెడ్డి, కాజా సాంబిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కొత్తూరి వెంకట సుబ్బారావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైవి సుబ్బారావు, నియోజకవర్గ కో-కన్వీనర్ దర్శనపు శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దారా అంబెడ్కర్, బజరంగ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.