వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం
విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సమీప మిత్రులుగా పేరొందిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ శనివారం సాయంత్రం ఉంగుటూరు మండలం తెలప్రోలులో సమావేశమయ్యారు. బెయిల్ పై విడుదలైన తర్వాత వంశీని మాజీ మంత్రి కొడాలి నాని తొలిసారి కలవడం విశేషం. ముగ్గురు నేతల భేటీ కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
సమావేశంలో ముగ్గురు నేతలు ఆప్యాయంగా ముచ్చటించుకుంటూ, జోకులు వేసుకుంటూ సరదా మూడ్‌లో గడిపారు. ఈ సందర్భంగా పేర్ని నాని చేసిన హాస్య వ్యాఖ్యలు అక్కడున్న నాయకులను కడుపుబ్బా నవ్వించాయి. ముగ్గురు నేతలు రాజకీయ, భవిష్యత్ ప్రణాళికలు, పార్టీ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
కేసుల వ్యవహారంలో అక్రమ అరెస్టులకు గురైన వల్లభనేని వంశీని కొడాలి నాని పరామర్శించారు. వంశీ సన్నిహితులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్, కృష్ణా జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడపా హర్ష, సింహాద్రి రాంబాబు, చుండూరు శేఖర్, కందుల నాగరాజు, పుల్లేటికుర్తి కృష్ణారావు, పాలడుగు రాంప్రసాద్, యార్లగడ్డ సత్యభూషణ్, కసుకుర్తి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.