గాజాలో మళ్లీ దాడులు: 47 మంది పాలస్తీనియన్లు మృతి
ఆసుపత్రులు, ఆహార కేంద్రాలపై బాంబుల వర్షం – కాల్పుల విరమణపై చర్చలకు హమాస్ సిద్ధత
ఇజ్రాయిల్ తాజాగా జరిపిన హవాయి దాడుల్లో మరోసారి గాజా ప్రజలు రక్తసిక్తమయ్యారు. ముఖ్యంగా ఆహార పంపిణీ కేంద్రాలు, ఆసుపత్రులు లక్ష్యంగా జరిపిన దాడుల్లో 47 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణల్లో వేలాది మంది అమాయకులు మరణించగా, చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా తోబుట్టువులను కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నారు.
గాజా ప్రజల ఆర్తనాదాలు మిన్నంటు...
ఈ మానవీయ విపత్తు మధ్య, గాజాలో ఆహారం కోసం నానా తిప్పలు పడుతున్న ప్రజలపై జరిపిన దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సహాయక కేంద్రాల వద్ద నిలబడి ఉన్న వందలాది మంది పౌరులపై విరుచుకుపడిన ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రులే లక్ష్యంగా జరిపిన దాడులు వైద్యం పొందుతున్న రోగుల ప్రాణాలకే కాదు, అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది భద్రతకూ ప్రమాదంగా మారాయి.
కాల్పుల విరమణపై చర్చలకు హమాస్ సిద్ధం
ఈ హింసాత్మక దాడుల నేపధ్యంలో 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై హమాస్ చర్చలకు సిద్ధమైంది. మధ్యవర్తిత్వంతో చర్చలు సాగుతుండగా, తక్షణ కాల్పుల విరమణపై మరింత స్పష్టత రానుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో గాజా ప్రజలకు తక్షణ మానవతా సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే సూచించింది.