గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలి
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు తక్షణమే పెంచాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేశాయి. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఉన్న రెవెన్యూ భవనంలో ఈ రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయ కుమార్, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రమయ్య నేతృత్వం వహించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో వేదికపై మాట్లాడిన వారు విఆర్ఓలు, విఆర్ఎలపై పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరిపడ నిధులు, శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక శిక్షణ తప్పనిసరిగా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
2014, 2019ల్లో గ్రామ రెవెన్యూ సహాయకుల జీతాలు పెంచినప్పటికీ, ఆ తరువాత పెంపు జరగలేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అర్హత కలిగిన విఆర్ఎలకు వాచ్మెన్, అటెండర్, డ్రైవర్, విఆర్ఓ పదోన్నతులు ఇవ్వాలని కూడా సూచించారు.
రెండు సంఘాల ఐక్యతను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహధ్యక్షుడిగా అనకాపల్లి జిల్లా భరణికం గ్రామ రెవెన్యూ అధికారి బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఎన్నుకోబడ్డారు.
మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీ జనరల్, గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.