IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్

IAS,IPS లకే కాదు… అందరికీ 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి: సిపిఎస్‌ అసోసియేషన్

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఏపీ సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకే సిపిఎస్‌ కాంట్రిబ్యూషన్‌ 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ విడుదల చేసిన జీవో ఆర్‌టి నెం.1793, తేదీ 28-09-2025 ను సిపిఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

ఆ సంఘం అధ్యక్షులు కే సతీష్, ప్రధాన కార్యదర్శి సిఎం దాస్ మాట్లాడుతూ,  “ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను వర్గీకరించి కొందరికి మాత్రమే ప్రయోజనం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఐఏఎస్‌లు ఉద్యోగులే, మేము ఉద్యోగులు కాదా? ప్రభుత్వ పనులు మేము చేయడంలేదా? ఐఏఎస్‌, ఐపీఎస్‌లకే ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకు చూపుతున్నారు?” అని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌ ప్రశ్నించారు.

2019, జనవరి 1న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నెం.1/3/2016-PR ను ఆధారంగా చేసుకొని ఐఏఎస్‌లకే పెంపు అమలు చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. గతంలో కూడా జీవో 1338ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని సిపిఎస్‌ ఉద్యోగులకూ 14 శాతం పెంచాలని డిమాండ్‌ చేసినా, ప్రభుత్వం వినిపించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

“ముగ్గురు ఐఏఎస్‌లకు సెంట్రల్‌ మెమో 57 వర్తింపజేసి వారిని పాత పెన్షన్‌లోకి పంపించారు. కానీ రాష్ట్రంలో ఉన్న 11 వేల మంది సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం అది అమలు చేయలేదు. ఇదెంత న్యాయం?” అని ప్రశ్నించారు.

“తక్షణమే రాష్ట్రంలోని అన్ని సిపిఎస్ ఉద్యోగులకు కూడా 2019 ఏప్రిల్‌ 1 నుండి 14 శాతం కాంట్రిబ్యూషన్ పెంచాలి. అలాగే మెమో 57 పరిధిలోకి వచ్చే ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ (OPS) అమలు చేయాలి” అని వారు డిమాండ్‌ చేశారు.

About The Author

Latest News