10న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిఏ పై చర్చ..!
క్యాబినెట్ ఎజెండాలో డిఏ అంశాన్ని. చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం
వైకాపా హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్ధితి ఎదురవుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఈ మేరకు తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని కూడా ప్రకటించారు. అలాగే దసరా సందర్భంగా కనీసం డీఎ బకాయిలు అయినా ప్రకటించాలని కూడా ప్రభుత్వం స్పందించలేదు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఈ నెలలో ఆందోళనలకు తెరలేపేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలొస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ బకాయిలపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీ అజెండాలో ఉద్యోగుల డీఏ అంశాన్ని కూడా చేరుస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో డీఏతో పాటు పీఆర్సీ నియామకం సహా ఇతర అంశాలపైనా కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క డీఏ కూడా విడుదల కాకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాగే అంతకు ముందు 4 డీఏలు కూడా బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం, కనీసం పీఆర్సీ కమిషనర్ ను అయినా నియమించకపోవడం, పీఆర్సీ బకాయిల చెల్లింపు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే అసంతృప్తి వారిలో నెలకొంది.
ఈ నేపథ్యంలో 10న జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కనీసం పెండింగ్ డీఏల్లో ఎన్నో కొన్ని అయినా ప్రకటిస్తారని వారు భావిస్తున్నారు. దీంతో పాటు పీఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన వంటి అంశాలపైనా కేబినెట్ దృష్టిసారిస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు. అదే జరిగితే ఉద్యోగుల్లో అసంతృప్తి కాస్తయినా చల్లారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.