ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ

ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులపై జీఓ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ

విజయవాడ ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జిఓను దీపావళి పండగలోగా విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏపిపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య హెచ్చరించారు. ఆర్టీసీ విలీనానంతరం గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుండి అసిస్టెంట్ మేనేజర్ వరకు, డిపో మేనేజర్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాత పద్ధతుల్లో ఉన్న శిక్షలు, సడలింపులు, అనుమతుల సమస్యల కారణంగా పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఎన్నో సార్లు ఈ సమస్యపై ఏపిపిటిడి యూనియన్ నిరంతరం కృషి చేయడంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం అనుమతుల కోసం లేఖ రాసిందని, ఆగస్టు 28న ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడి శాఖలో ఫైలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఇప్పటికీ జిఓ విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సుమారు 6000 మంది ఆర్టీసీ ఉద్యోగులు నిరాశలో ఉన్నారని తెలిపారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరు జిల్లాల విజయనగరం జోన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ స్థాయి కౌన్సిల్ సమావేశం జోనల్ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంతవరకు జోనల్ అధ్యక్షులుగా పనిచేసిన కె.జె.శుభాకర్ గత నెల 30న ఉద్యోగ విరమణ చేయడంతో జోన్‌కు చెందిన 19 డిపోల ఉద్యోగులు, నాయకులు కలిసి ఆయనకు ఘన సత్కారం అందించారు.

సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు 15 నుండి అమలు చేసిన స్త్రీ-శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ అపారమని అన్నారు. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి సిబ్బందిని అభినందించడం గర్వకారణమని పేర్కొన్నారు. అయితే బస్సులు తక్కువగా ఉండటం, ప్రయాణికులు అధికంగా ఉండటం, సిబ్బంది కొరతతో తీవ్రమైన పనివత్తిడిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇంత శ్రమిస్తున్న సిబ్బందిపై దాడులు జరగడం అన్యాయమని, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకొని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

About The Author

Latest News