ఎస్ఆర్ఎంలో ఎన్సీసీ యూనిట్ ప్రారంభం
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఎన్ సీ సీ యూనిట్ ప్రారంభించారు. తెనాలి కేంద్రంగా ఉన్న 22వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై వర్సిటీ ప్రాంగణంలో యూనిట్ ను ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తో కలిసి జాతీయ జెండా, ఎస్సీసీ జెండాలను ఆవిష్కరించిన ఉదయకుమార్ యూనివర్సిటీలో ఎన్సీసీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన యూనిట్ ప్రారంభ సభలో కల్నల్ ఉదయకుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, సంఘటిత శక్తిని పెంచేందుకు ఎస్సీసీ శిక్షణ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు పట్టుదలతో శిక్షణ పొందితే వారి భావి జీవితం ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఏడాదికి 56 మంది విద్యార్థులకు ఎన్సీసీ శిక్షణ అందేలా అనుమతి మంజూరైనట్లు వివరించారు. ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం, పెద్దల పట్ల గౌరవ భావం పెరిగేందుకు ఎన్సీసీ శిక్షణ మార్గం చూపుతుందన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఎస్సీసీ శిక్షణను అందిపుచ్చుకుని దేశ సమైక్యతకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీసీ బెటాలియన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. యూనిట్ ప్రారంభ పత్రాలను కల్నల్. ఉదయ్ కుమార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువుడు ఎన్సీసీ అధికారులు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్‌కుమార్, డైరెక్టర్ అనూప్ సింగ్, రేవతి, గురుప్రత్ విద్యార్థులు పాల్గొన్నారు.