రాష్ట్రంలో ప్రజారంజక పాలన
అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం
అడగకుండానే వరాలిస్తోన్న కూటమి ప్రభుత్వం
గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అధ్వానం
సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని, సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ లెజిస్లేటివ్, వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరు నగరంలోని తొమ్మిదో డివిజన్ సుద్దపల్లి డొంక యాదవ బజారు 2/7, గణేశ్ నగర్ 2వ లైనులో రూ.84 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నగరాన్ని నరకంగా మార్చారని మండిపడ్డారు.
యూజీడీ పనులు ఎక్కడకక్కడ వదిలేయడంతో పాదచారులు సైతం బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఏ వీధికెళ్లినా గుంతలమయమేనని విమర్శించారు. అలాంటి పరిస్థితి నుంచి గుంటూరు నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీరు బయటికి పోయేందుకు సమగ్ర ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టామని తెలిపారు. సుమారు 40 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న మొండి గేటు వద్ద సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. వెంట్ వే నిర్మాణ పనులు వేసవిలో ప్రారంభిస్తామని, తద్వారా మురుగు సమస్య శాశ్వత పరిష్కారమవుతుందని వెల్లడించారు. అంతర్గతంగా ప్రతి ప్రాంతంలో మురుగు కాలువలు నిర్మిస్తున్నామని, రోడ్లు వేయిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని వెల్లడించారు. దీంతోపాటు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఆటోడ్రైవర్లకు వరాలిచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ యాల్లావుల అశోక్, జాగర్లమూడి శ్రీనివాసరావు, ఐలా శ్రీనివాసరావు, అల్లం బాజీ, డివిజన్ అధ్యక్షులు బట్ట రాజా, రియాజ్, జాడ సురేష్ గట్టు శ్రీకాంత్, కందుకూరి వెంకట్, కూరాకుల ప్రభాకర్, ప్రసాద్, ఆరిఫ్, నరసింహ, కొలగాని కృష్ణ, రియాసత్ తదితరులు పాల్గొన్నారు.