కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం
విజయవాడలోని హయత్ హోటల్ లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టూరిజం స్టేక్‌హోల్డర్స్‌తో జరిగిన ఇంటరాక్టివ్ మీటింగ్‌లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
పర్యాటక పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తే ప్రభుత్వం తరపున భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేష్ హామీ
ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కలిసి దేశ, విదేశాల్లో పర్యటిద్దామన్న మంత్రి దుర్గేష్
యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడి
నూతన పర్యాటక రంగ పాలసీతో అభివృద్ధికి అడుగులు పడ్డాయని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో పర్యాటకం పరుగులు పెడుతుందని ధీమా
నవంబర్ 15న విజయవాడ నుండి సింగపూర్ నాన్ స్టాప్ ఫ్లైట్ కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కలిసి దేశ, విదేశాల్లో పర్యటిద్దామని తద్వారా పర్యాటక పెట్టుబడులు సాధించి ఆకాశమే హద్దుగా పర్యాటకాభివృద్ధి చేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.సోమవారం విజయవాడలోని గుణదలలో ఉన్న హయత్ హోటల్ లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో టూరిజం స్టేక్ హోల్డర్లతో జరిగిన చర్చా వేదికలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నవంబర్ 15న విజయవాడ నుండి సింగపూర్ ఇండిగో నాన్ స్టాప్ ఫ్లైట్ కు సంబంధించిన పోస్టర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. నవంబర్ 15న 6E 1029 నెంబర్ గల విమాన సర్వీస్ ఉదయం 10.05 కు విజయవాడలో బయలుదేరుతుందని అదే రోజు సాయంత్రం 4.40 గం.లకు సింగపూర్ చేరుతుందన్నారు. అదే రోజు 6E 1030 నెంబర్ గల మరో విమాన సర్వీస్ సింగపూర్ నుండి అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 6.10కు బయలుదేరి 7.45కు విజయవాడకు చేరుతుందన్నారు.
నూతన పర్యాటక రంగ పాలసీతో అభివృద్ధికి అడుగులు పడ్డాయని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో పర్యాటకం పరుగులు పెడుతుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఫెడరేషన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వపరంగా కూడా సహకారం అందించినట్లైతే ఇలాంటి కార్యక్రమాలు మరింత విజయవంతమవుతాయని తెలిపారు.ప్రైవేట్ రంగంలో ఉన్న వారంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామని అభిప్రాయపడ్డారు. అందరికీ ఉపయోగపడేలా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించడంతోపాటు, సరికొత్త పర్యాటక పాలసీని తీసుకురావడం ఈ రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. నూతన ఫెడరేషన్ కార్యవర్గం, ప్రభుత్వం కలిసి పని చేస్తే పర్యాటకరంగాన్ని లాభదాయకం చేయడంతోపాటు పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని, ఎంతోమందికి ఉపాధిని కల్పించగలుగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వంలో భాగంగా తాము అధికారులతోకన్నా, పర్యాటక రంగ భాగస్వాములైన ఆర్.స్వామి, మురళి, భాస్కర్‌లతో ఎక్కువసార్లు కలిశామని గుర్తు చేశారు. ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వంతో కలవడం వల్ల సమష్టి ప్రయోజనం పొందగలుగుతామని చెప్పారు. ఫెడరేషన్‌గా ఏర్పాటు కావడం వల్ల హెల్త్, వెల్ నెస్, అడ్వెంచర్ టూరిజం తదితరాలన్నీ పర్యాటకులకు అందించగలుగుతామని వివరించారు. సాంస్కృతిక శాఖను కూడా అనుసంధానం చేయడం ద్వారా మరింత గొప్ప అనుభూతిని అందించేలా ప్రభుత్వం, ఫెడరేషన్ కలిసి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు.
ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు దానికి అనుబంధంగా టూరిజంకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అందులో వివిధ విభాగాలకు కార్యవర్గ సభ్యులను నియమించి వారందరినీ సమావేశ పరచడం సంతోషించదగ్గ విషయమని మంత్రి దుర్గేష్ అన్నారు.టూరిజం రంగానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి అనుసంధానంగా మైస్, అడ్వెంచర్, వెల్ నెస్, హెలీ,హెల్త్ ఇలా ఒక్కో విభాగానికి ఒక్కొక్క కార్యవర్గ సభ్యుడిని నియమించడం గొప్ప ఆలోచనగా అభివర్ణించారు.తద్వారా కార్యక్రమ నిర్వహణకు కార్యాచరణ ఏర్పరుచుకునేందుకు మంచి మార్గదర్శకత్వంగా ఉపయోగపడుతుందన్నారు.
ఉపాధి కల్పించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ అన్నారు.సరైన రీతిలో అభివృద్ధి చెందితే టూరిజం ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా కామన్ ప్లాట్ ఫామ్ తీసుకురావడంలో చొరవ చూపిన ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామిలను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా హయత్ హోటల్ ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన సందర్భంగా ఆ హోటల్ యజమాని ఆర్. స్వామిని మంత్రి దుర్గేష్ అభినందించారు.
రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పీపీపీ విధానంపై ఆధారపడిందని, ఆ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.పీపీపీ విధానంలో ఇన్వెస్టర్లు ముందుకొస్తే ప్రభుత్వం తరపున ల్యాండ్ పార్సల్, రాయితీలు, ప్రోత్సాహకాలు తదితర అవసరమైన సహకారం అందిస్తామన్నారు. మంచి గ్రూప్ లతో టైఅప్ అవ్వాలని సూచిస్తూ ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా ఏ ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు జారీ చేస్తామన్నారు.
కేరళ కంటే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆంధ్రప్రదేశ్ సొంతమని మంత్రి దుర్గేష్ అన్నారు.రాష్ట్ర ప్రకృతి సౌందర్యాలను సరైన రీతిలో ప్రచారం చేసుకోలేకపోయామని, ఇకపై అద్భుతంగా ప్రమోషన్స్ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. అందరం కలిసి సరైన కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దేశ, విదేశాల్లో పర్యటించి సరైన ప్రచారం కల్పించేందుకు చొరవ తీసుకుందామని పిలుపునిచ్చారు.
కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం 15 నెలల కాలంలో పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అనేక రకాల విప్లవాత్మక కార్యక్రమాలను, వినూత్న నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. అందరికీ ఉపయోగపడే పారిశ్రామిక హోదాను టూరిజం రంగానికి ఇచ్చిందన్నారు. కొత్త పాలసీని తీసుకొచ్చామన్నారు. దానికి అనుబంధంగా ప్రభుత్వ ఆలోచనలకు రూపంగా క్యారవాన్, ల్యాండ్ అలాట్ మెంట్, హోమ్ స్టే తదితర పాలసీలను విడుదల చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక, ఆతిథ్య రంగాలకు స్వర్గధామమని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, ఇన్వెస్టర్లకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజి, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీ శ , ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షు,ప్రధాన కార్యదర్శులు పొట్లూరి భాస్కరరావు,సుబ్బారావు రావూరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బి. రాజశేఖర్, ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి,పలువురు పర్యాటక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

