ప్రకృతి వ్యవసాయం... ఆరోగ్యానికి ఆహ్వానం
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్టు ఫైల్) : ప్రకృతి వ్యవసాయం, దేశవాళీ విత్తనాలు ఆరోగ్యానికి వరప్రదమని పలువురు రైతులు వివరించారు. రైతన్నా ! మీ కోసం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల జిల్లా స్థాయి సదస్సు ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రగతిశీల రైతులు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, వ్యవసాయ ఉత్పాదక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో మంచి ఫలితాలు పొందుతున్నామని చెప్పారు. కొంత మంది రైతుల అభిప్రాయాలు...
మంగళగిరి మండలంకు చెందిన ప్రగతిశీల రైతు టి.శివరాం రెడ్డి మాట్లాడుతూ భూసారాన్ని పరిరక్షించుటకు కేవలం పొటాష్ మాత్రమే వినియోగిస్తానని చెప్పారు. వివిధ రకాల అరటి తోటలు పెంపకంతో పాటు ఇతర పంటలు వేస్తామని చెప్పారు. నాలుగు వందల మంది రైతులకు కొవ్వూరు అరటి పరిశోధన కేంద్రం నుంచి నాణ్యమైన విత్తనాలు అందించామని అన్నారు. ప్రతీ ఎకరాకు మూడు, నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని, ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. మండలంలో సూక్ష్మ సాగు నీటి పథకం మొట్టమొదటగా వినియోగించానని, అనంతరం ఇతరులు ప్రారంభించారని చెప్పారు.
ప్రగతిశీల రైతు శ్రీధర్ (కొల్లిపర) మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని, ఇందుకు కాషాయాలు తయారు చేసుకోవడం జరుగుతుందన్నారు.
మిరప ఎగుమతుల సంఘం కార్యదర్శి తోట రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచానికి అవసరమగు మిరపలో మన దేశం 33 శాతం అందిస్తుందన్నారు. దేశంలో మిరప పరిశోధన కేంద్రం లేదని, విత్తన బ్యాంకు లేదని అన్నారు. పెద్ద ఎత్తున సాగు చేస్తున్న మిరపకు సరైన బోర్డు, చట్టం లేదని ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వట్టిచెరుకూరుకు చెందిన నాదెండ్ల ధనుంజయ రావు మాట్లాడుతూ పురుగు మందులు వినియోగం వలన అనారోగ్యంపాలు కావడం జరుగుతుందన్నారు. "సుభాష్ పాలేకర్ మా ప్రాంతం సందర్శించడం, ఒక గోవు ఉంటే ఎన్నో రకాల వ్యవసాయ విధానాలను అవలంబించవచ్చని" చెప్పడంతో ఆయన స్పూర్తితో రెండు ఎకరాల భూమిని ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎకరాకు 35 నుండి 40 బస్తాల ధాన్యం దిగుబడి సాధిస్తున్నామన్నారు. భూమి ఆరోగ్యం కాపాడుటకు జీవామృతం తయారు చేయడం, తూటాకు కాషాయం వంటి వాటిని తయారు చేసి వినియోగిస్తున్నామని చెప్పారు.
దుగ్గిరాల మండలంకు చెందిన మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం స్థాయిలో పంటల సేకరణ ఉండాలన్నారు.

