పెన్షన్–జిపిఎఫ్ సేవలు డిజిటల్ దిశగా – ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ కీలక చర్చలు
పెన్షన్ మరియు జిపిఎఫ్ అప్లికేషన్లో సరళతరం మరియు డిజిటలైజేషన్ ను ఆహ్వానిస్తున్నాం..
ఉద్యోగుల తరుపున పలు సూచనలు చేశాం..
ఏపీ జెఎసి చైర్మన్ ఏపీ ఎన్జీజివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్, జిపిఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి కీలక సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. రాబోయే నెలల్లో అమలు చేయనున్న ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు ఆర్థిక శాఖ అధికారులు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమైన సమీక్ష నిర్వహించారు.
వెలగపూడి సచివాలయ రెండో బ్లాక్‌లో శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్, జిపిఎఫ్ లావాదేవీలు, రుణాలు, చెల్లింపులు తదితర అంశాలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ఈ సమావేశం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రాసెసింగ్ సిస్టం (RBPS) మరియు ఏపీ జిపిఎఫ్ ప్రాసెసింగ్ సిస్టం రూపకల్పనపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, సూచనలు సేకరించారు.
సమావేశంలో ఎన్జీవో సంఘం, ఉపాధ్యాయ సంఘాలు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పెన్షనర్ల సంఘాలు పాల్గొన్నాయి. అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతిపాదిత రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రాసెసింగ్ సిస్టం, జిపిఎఫ్ డిజిటల్ సిస్టం, ఏపీ జి ఎల్ ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ విధానాలు వంటి అంశాలను వివరించారు. ఒకే కామన్ అప్లికేషన్ ఆధారంగా ఉద్యోగి సేవా కాలానికి సంబంధించిన అన్ని వివరాలు అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అయ్యే విధంగా సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. అప్లికేషన్ స్టేటస్‌ను మొబైల్ ద్వారా ట్రాక్ చేసుకునే సౌకర్యం, పెన్షన్ ప్రపోజల్ జాప్యాలపై నిధి పోర్టల్‌లోనే ఫిర్యాదులు స్వీకరించే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాలు, సాంకేతిక ఇబ్బందులు, ఆర్థరైజేషన్–చెల్లింపు సమస్యలను పూర్తిగా తొలగించేలా కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రూపొందిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఉద్యోగులకు అనుకూలంగా, పారదర్శకంగా ఉండేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాల తరఫున ఏపీ జెఎసి చైర్మన్, ఎన్జీజివో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నప్పటికీ, వ్యవస్థలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని కోరారు. పెన్షనర్ల యాన్యువల్ వెరిఫికేషన్‌ను మొబైల్ ద్వారా చేసే సౌకర్యం అందిస్తుండటం ప్రశంసనీయం అని పేర్కొన్నారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను నేరుగా సంబంధిత అధికారికి పంపే విధంగా సిస్టమ్‌ను రూపొందించాలని సూచించారు. జీవో 100 ప్రకారం పెన్షన్ చెల్లింపుల సరళీకరణ నిబంధనలను కూడా కొత్త వ్యవస్థలో చేర్చాలని కోరారు.
ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతూ జిపిఎఫ్‌తో పాటు జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్, మునిసిపల్ ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థలను కూడా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ విధానంలో భాగం చేయాలని కోరాయి.
సమావేశంలో ఎన్జీవో సంఘం నాయకులు విద్యాసాగర్, డివి రమణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు KSS ప్రసాద్, నక్క వెంకటేశ్వర్లు, హృదయ రాజు, కృష్ణయ్య, రెవెన్యూ సంఘ ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం నుండి చంద్రశేఖర్, సుబ్బు నారాయణ, పెన్షనర్ల సంఘం నుండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

