విజ్ఞాన్స్ వర్సిటీ – ఇప్సైటీ డయాగ్నస్టిక్స్ రీసెర్చ్ సెంటర్‌ల మధ్య అవగాహన ఒప్పందం
అవగాహన పత్రాల మార్పిడి
విద్యార్థులకు మేలు కలిగించే ఒప్పందం
మాలిక్యులర్ డయాగ్నస్టిక్ అభివృద్ధి
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ , ఇప్సైటీ డయాగ్నస్టిక్స్ – రీసెర్చ్ సెంటర్‌ల మధ్య శుక్రవారం ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్, ఇప్సైటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి కొగంటి, సీఈవో – సీఎస్‌వో డాక్టర్ సందీప్ కుమార్ నాదేండ్ల హాజరై అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, ప్రెసిషన్ మెడిసిన్, ఆధునిక జీవసాంకేతిక రంగాలలో శాస్త్రీయ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు కలిసి నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్, డ్రగ్ ఇంటరాక్షన్‌ల విశ్లేషణ, మాలిక్యులర్ రీసెర్చ్, లో–కాస్ట్ పీసీఆర్ టెక్నాలజీ అభివృద్ధి, సెప్సిస్ ట్రాన్స్‌క్రిప్టోమిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ అనాలిటిక్స్ వంటి ఆధునిక పరిశోధన రంగాల్లో కలిసి పనిచేయనున్నామని వెల్లడించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ నుండి పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ ప్రాజెక్టుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్సైటీ సంస్థ స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ ప్రయోగశాలలు, హైఎండ్ పరికరాలు, బయోఇన్ఫర్మాటిక్స్ సపోర్ట్, క్లినికల్ డేటా ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. వీటితో పాటు యూజీ – పీజీ విద్యార్థులకు పరిశోధన ఇంటర్న్‌షిప్‌లు, సంయుక్త పరిశోధన ప్రతిపాదనలను జాతీయ–అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీలకు సమర్పించడం, ఇప్సైటీ సంస్థ ఉద్యోగులకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఉన్నత చదువులకు అవకాశాలు, అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, అంతర్జాతీయ సదస్సులు, సింపోజియాలు, సంయుక్త శాస్త్రీయ పత్రాల ప్రచురణ, ఇన్నోవేషన్, స్టార్టప్–ఇకోసిస్టంపై సంయుక్త కార్యక్రమాలు, హెల్త్‌కేర్–లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా బ్రిడ్జ్ బలోపేతం చేస్తామన్నారు. ఇవన్నీ విద్యార్థులకు ప్రాక్టికల్ రీసెర్చ్, ఇంటర్‌డిసిప్లినరీ లెర్నింగ్, నైపుణ్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. వైద్య నిర్ధారణ, మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, జీనోమిక్స్ రంగాల్లో రెండు సంస్థల సహకారం వలన ఆరోగ్య సేవల మెరుగుదల, ఖచ్చితమైన రోగ నిర్ధారణ, ప్రెసిషన్ థెరపీ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో అధునాతన పరీక్షలు అందించడంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య పరిశోధన, బయో–క్లినికల్ ఇన్నోవేషన్‌కు దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్‌లర్ కల్నల్ ప్రొఫెసర్ పీ. నాగభూషణ్, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు.

