ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : ఏపీ ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక విద్యారంగ సంస్థ క్యూ ఎస్ ఐ- గేజ్ హ్యాపీనెస్ అవార్డు లభించింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన క్యూ.ఎస్.ఐ గేజ్ వార్షిక అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య సతీష్ కుమార్, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ర్యాంకింగ్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్ లు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు.
క్యూ ఎస్ ఐ గేజ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవీన్ నాయర్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. క్యూఎస్ఐ గేజ్ సంస్థ ఏటా దేశంలోని కళాశాలలు విద్యాసంస్థల పనితీరును వివిధ రంగాల్లో విశ్లేషించి ర్యాంకులను ప్రకటిస్తుంది. ఏపీ ఎస్ఆర్ ఎం
యూనివర్సిటీ పనితీరును వివిధ కోణాల్లో విశ్లేషించిన క్యూ ఎస్ఐ గేజ్ సంస్థ 2025- 26 సంవత్సరానికి ఆనందమయ యూనివర్సిటీగా పరిగణించి హ్యాపీనెస్ అవార్డుకు ఎంపిక చేసింది.
ఏపీ ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీ కి హ్యాపీనెస్ అవార్డు లభించడం పట్ల వర్సిటీ ప్రో ఛాన్స్లర్ డాక్టర్ పి.సత్యనారాయణన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యకర ఆనందమయ వాతావరణాన్ని కల్పించడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత ప్రమాణాల పెంపుదల సాధ్యమని డాక్టర్ సత్యనారాయణన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సానుకూల అభ్యాస వాతావరణాన్ని కల్పించడం విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు .విద్యార్థుల శ్రేయస్సుతోపాటు విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు.

