శ్రీశైలం గిరిప్రదక్షిణలో భక్తిసాంద్రత
శ్రీశైలం ( జర్నలిస్ట్ ఫైల్ ): పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శ్రీస్వామి, అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది.ఆలయ మహాద్వారం నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయాన్ని దాటి, అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారికి చేరుకుంటుంది. అక్కడి నుంచి సారంగధర మఠం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, మహిషాసురమర్ధిని ఆలయం, రుద్రాక్షమఠం, విభూతిమఠం మీదుగా రుద్రవనంలోకి వెళ్లి, చివరకు నందిమండపం వద్ద గిరిప్రదక్షిణ ముగుస్తుంది.ఈ సందర్భంగా భక్తులు క్షేత్రంలోని పలు ప్రాచీన ఆలయాలను, మఠాలను దర్శించుకునే అవకాశముంటుంది. భక్తులలో ఆధ్యాత్మికతను బలపరచడం, క్షేత్ర మహాత్మ్యాన్ని పరిచయం చేయడం లక్ష్యంగా గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు దేవస్థానం తెలిపింది.గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులందరికీ అనంతరం స్వామివారి దర్శనం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే భక్తుల నడకలతో శ్రీశైలం మార్గాలు భక్తిరసంతో నిండి పోయాయి.