సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాలు శుక్రవారం అర్థరాత్రి మాక్ డ్రిల్ నిర్వహించాయి. రాత్రి 1:30 గంటల సమయంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఈ డ్రిల్ జరిగింది. రాష్ట్ర ఐజీ (ఆపరేషన్స్) ఆదేశాలతో, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతకు ముందస్తుగా సన్నద్ధత కోసం ఆక్టోపస్ బలగాలు తరచూ ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంటాయి. వీటి ద్వారా ప్రత్యక్ష పరిణామాలను అంచనా వేసి, బలగాల సామర్థ్యాన్ని పరీక్షించడంతోపాటు, సమాచార మార్పిడిలో సమర్ధతను మెరుగుపరుచుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన ఆక్టోపస్ ప్రత్యేక విభాగంగా పనిచేస్తోంది. ఈ బలగాలు అత్యాధునిక ఆయుధాలతో, ప్రత్యేక శిక్షణతో, ఎల్లప్పుడూ ఉగ్రవాద కార్యకలాపాల ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటాయి. పౌరులు, వీవీఐపీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల భద్రతను సమర్థవంతంగా కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ, ఆక్టోపస్ డీఎస్పీతో పాటు తుళ్లూరు సీఐ, ట్రాఫిక్ సీఐ, ఆర్‌ఐలు, 40 మంది ఆక్టోపస్ బలగాలు, ఎస్‌టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.