12వ వేతన సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి: ఏపీజీఈఏ
జూన్ 5న విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్న ఉద్యోగ సంఘం
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, 12వ వేతన సవరణ (పీఆర్సీ) కోసం రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) గుంటూరు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. మే 15, 2025న గుంటూరులో జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాంద్ బాష మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యోగుల ఆందోళన తప్పదన్నారు. 12వ పీఆర్సీ కోసం రిటైర్డ్ జడ్జిని కమిటీగా నియమించాలి, లేకపోతే తాత్కాలికంగా 28 శాతం ఐఆర్ (ఇంటిరిమ్ రిలీఫ్) ప్రకటించాలి. అయినా చర్యలు తీసుకోకపోతే నేరుగా 32 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేసి, పే ఫిక్సేషన్ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికే ఉద్యోగులు రెండు సంవత్సరాల పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయారని, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై ఇంకా దృష్టి సారించకపోతే జూన్ 5న విజయవాడలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించి నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాదరి, ఉపాధ్యక్షులు విజయబాబు, మురళి, కోశాధికారి పోతురాజు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదరత్తయ్య, తాలూకా యూనిట్ అధ్యక్షులు చంద్రమౌళి (దుగ్గిరాల), సుదర్శన్ రాజు (ఫీరంగిపురం), చెన్నయ్య (ప్రతిపాడు), సుబ్బారావు (తాడికొండ), మహిళా విభాగ సభ్యులు అరుణ, చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.