రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి

రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ విద్యార్ధుల విజయ భేరి


•    బీసీ విద్యార్థుల ఉత్తమ ప్రతిభకు గుర్తింపే ఈ సన్మానాలు 
•    జూన్ 15 న తల్లికి వందనం ద్వారా రూ. 15,000 అందజేత
•    జూన్ నుంచి అన్ని హాస్టల్స్ లో సన్న బియ్యంతో భోజనం
•    200 మందికి సర్టిఫికెట్స్, మెమొంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు 

-    ఎస్. సవిత, రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి

     అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో బీసీ విద్యార్ధుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తెలిపారు. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన బీసీ హాస్టల్స్, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాల విద్యార్ధులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత  పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన బీసీ సంక్షేమ, మహాత్మ జ్యోతీబా పూలే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించటం గర్వించదగ్గ విషయన్నారు. విద్యార్ధుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్ధులు మంచి ఫలితాలు రావలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అన్నారు. అందుకు అనుగుణంగా టీచర్లు, విద్యార్ధులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. 

             రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు భావితరాల భవిష్యత్ కోసం పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం పునాదులు వేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణా పనులను శరవేగంగా జరుగుతున్నాయన్నారు. తల్లికి వందనం క్రింద ప్రతి ఇంట్లో చదువుకునే ఆడబిడ్డకు జూన్ 15 న రూ. 15,000 అందిస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు.  బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, తదితర మౌలిక ఏర్పాట్లు చేసామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ హాస్టల్స్, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాల్లో టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తామన్నారు.  ఈ ఏడాది పది, ఇంటర్ ఫలితాల్లో బీసీ గురుకులాలు, హాస్టల్  విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందనలన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 109 గురుకులాల్లో 108 గురుకులాలు మా ప్రభుత్వ హయాంలో వచ్చినవేనన్నారు. ఆనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీలను విద్యా పరంగా ప్రోత్సహిస్తే అదే స్ఫూర్తిని ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మరిన్ని  బీసీ గురుకులాలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

              గత ప్రభుత్వం బీసీ గురుకులాలు, హాస్టళ్లను మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను  రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. వెనుకబడిన తరగతుల పిల్లలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్వేయమన్నారు. అన్ని హాస్టల్స్ లో ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా విధ్యార్ధుల హాజరు తీసుకుని భోజనం అందిస్తున్నామన్నారు. బీసీ యువతకు సివిల్ సర్వీసులో శిక్షణతోపాటు, మెగా డీఎస్సీకి శిక్షణను అందిస్తున్నామన్నారు. విదీశీ విద్యా కూడా అందిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల్లో చదివామనే చెప్పుకునేందుకు గర్వంగా ఉండాలని, ఎంజేపీ  గురుకులాల్లో చదివానని అందరూ గర్వంగా చెప్పుకునేలా విద్యాలయాలను తీర్చి దిద్దుతున్నామన్నారు. పిల్లలకు ఇష్టమైన రంగంలో తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు. విద్యార్ధులు సెల్ ఫోన్ ను అవసరం మేరకే వినియోగించాలని ఎక్కువగా వినియోగించవద్దని.. ఆ సమయాన్ని విద్యపై కేటాయించి జీవితంలో ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు వినియోగించుకోవాలన్నారు. పాఠశాలలు తెరిచిన వెంటనే రాష్ట్రంలో అన్ని బీసీ సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. విద్యా దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ త్యాగాలను మనందరం గుర్తుంచుకోవాలన్నారు. ముందుగా జ్యోతిబా పూలే, దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ ల చిత్ర పటాలకు మంత్రి పూల మాలలు అర్పించారు.

          బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యన్నారాయణ మాట్లాడుతూ ఏ విద్యార్ధి అయినా నిరంతరం శ్రమిస్తేనే ఉన్నతంగా తన జీవితంలో స్థిరపడతారన్నారు. జీవితంలో తపనతోపాటు ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉండాలని అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగల్గుతారన్నారు. 

       ముగింపు సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ డి. చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ విద్యార్ధులు ఇదే ప్రతిభను నిరంతరం కొనసాగించాలని సూచించారు. 

          రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, బీసీ సంక్షేమ హాస్టల్స్ నుంచి 200 మందికి బ్యాగులు, సర్టిఫికెట్స్, మెమొంటోలు అందించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన 22 మందికి నగదు పురస్కారాలు అందించారు. ఇందులో 8 మంది బీసీ హాస్టల్స్ కు చెందినవారు కాగా 14 మంది ఎంజేపీ స్కూల్స్, కళాశాలలకు చెందినవారున్నారు.. ప్రధమ బహుమతి పొందిన 12 మందికి ఒక్కొక్కరికీ రూ. 20,000 చొప్పున, 7 మందికి ఒక్కొక్కరికీ రూ. 15,000 చొప్పున, ముగ్గురికి ఒక్కొక్కరికీ రూ. 10,000 చొప్పున నగదు పురస్కారాలు అందించారు. 

కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల డాక్టర్ ఏ. మల్లిఖార్జున్, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాల సొసైటీ కార్యదర్శి పీ. మాధవీలత, ఏ. కృష్ణ మోహన్, తదితరలు పాల్గొన్నారు.  

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని