పంజాబ్లో కల్తీ మద్యం కలకలం – 14 మంది మృతి, 6 మంది పరిస్థితి విషమం
మజిత ప్రాంతంలో విషాదం, ఐదు గ్రామాల్లో ఉక్కిరిబిక్కిరి
అమృత్సర్ (పంజాబ్) : పంజాబ్లో కల్తీ మద్యం మళ్లీ ప్రాణాలు బలిగొంది. అమృత్సర్ జిల్లా మజిత పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీ మద్యం సేవించిన 14 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ విషాదకర ఘటన భంగలి, పటాల్పురి, మరారి కలాన్, తేరేవాల్, తల్వండి ఘుమాన్ గ్రామాల్లో చోటుచేసుకుంది. మృతుల కుటుంబాల్లో విషాదచాయలు అలముకున్నాయి.
ప్రధాన నిందితుడితో పాటు నలుగురు అరెస్టు
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు ప్రభజీత్ సింగ్తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ప్రభజీత్ సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గు, సాహిబ్ సింగ్ అలియాస్ సరారు, గుర్జంత్ సింగ్ (మార్డి కలాన్), జీత భార్య నిందర్ కౌర్ (తిరెన్వాల్) ఉన్నారు.
ఇంత మంది ప్రాణాలను బలిగొన్న కల్తీ మద్యం ఎక్కడి నుండి వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపారు.