జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రకటనలు!
భారీ కంటెంట్, దేశీయ-అంతర్జాతీయ సిరీస్‌లు, సినిమాలతో భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రతి ఇంటిలో ప్రాధాన్యం సంపాదించుకున్న డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే ఓటీటీ రంగంలో అనేక సంస్థలు పోటీపడుతున్నా... అమెజాన్ తన ప్రత్యేకతను నిలుపుకుంటూ విశ్వసనీయత సాధించింది.
కొన్ని సంవత్సరాల క్రితం కేవలం రూ.300కు లభించిన ప్రైమ్ సభ్యత్వ రుసుము, కరోనా తర్వాత రూ.500కు, ఆపై రూ.1500కు పెరిగింది. అయినా, ఈ ప్లాట్‌ఫాం కోసం ప్రజలు ఇంటి ఖర్చులను తగ్గించుకుంటూ అయినా సభ్యత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ స్థాయిలో అలవాటు పడిన ప్రజలకు ఇది మారలేని భాగంగా మారింది.
అయితే తాజాగా, అమెజాన్ ప్రైమ్ వీడియో నెత్తిన ‘వాణిజ్య బాంబు’ వేసింది. జూన్ 17, 2025 నుంచి, ప్రైమ్ వీడియోలో ప్రసారమయ్యే సినిమాలు, టీవీ షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రైమ్ సభ్యులకు ఓ లేఖ పంపింది.
ఆ లేఖలో పేర్కొనబడినట్లుగా:
“ప్రియమైన ప్రైమ్ మెంబర్, జూన్ 17, 2025 నుంచి ప్రైమ్ వీడియో సినిమాలు మరియు టీవీ షోలలో పరిమిత ప్రకటనలు ప్రసారం అవుతాయి. ఈ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో మేం మీకు మరింత మెరుగైన కంటెంట్‌ను అందించగలుగుతాం.”
ఈ నిర్ణయం ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తేలాల్సిన విషయం. కానీ, పేమెంట్ చేసినవారికి మధ్యలో ప్రకటనలు వస్తే అసంతృప్తి కలగడం ఖాయం. తద్వారా ఓటీటీ రంగంలో ప్రకటనల యుగానికి ఇది నాంది కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.