గుంటూరు పోలీసుల దూకుడు... నేరాల నిరోధానికి ఎస్పీ కాలినడక పర్యటన
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): : నేరాల నిర్మూలనకు గుంటూరు జిల్లా పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. పాత, కొత్త నేరస్తుల కదలికలపై నిఘా పెంచుతూ, క్షేత్రస్థాయిలో సందర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేట 1వ లైన్ నుంచి శారద కాలనీ 21వ లైన్ వరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం సాయంత్రం కాలినడకన పర్యటించారు.
నేరచరిత్ర ఉన్నవారి నివాసాలను స్వయంగా పరిశీలించిన ఎస్పీ… వారి కుటుంబ సభ్యులను పలకరించి, భవిష్యత్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్న చిన్న వివాదాల్లోనైనా పాల్గొంటే తీవ్రంగా ఎదుర్కొవలసి వస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి మీద పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, నిఘా కొనసాగుతోందని వివరించారు.
నగరంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలీసుల కర్తవ్యం ప్రజల రక్షణేనని… ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని సూచించారు.ఈ పర్యటనలో డీఎస్పీ అరవింద్, ఎస్‌బి-1 సీఐ అలహారి శ్రీనివాస్, అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు, ఎస్సైలు కృష్ణబాజీ, ప్రసన్నకుమార్, ఆంజనేయులు, రోజాలత పాల్గొన్నారు.