అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన 8వ జీఎస్టీ దినోత్సవ వేడుకలో కస్టమ్స్, జీఎస్టీ అప్పీల్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున నరసింహారెడ్డికి అందజేశారు. అవయవదానంపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 300 మందిలో అవయవ దానానికి అంగీకార పత్రాలను సేకరించినందుకు ఈ గౌరవం లభించింది. సెంట్రల్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ వి. సంగీత మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, అవయవ లోపాలతో బాధపడుతున్నవారికి ప్రాణదాయక అవయవాలను అందించడంలో నరసింహారెడ్డి చేసిన సేవలు అపూర్వమన్నారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ విజయాన్ని సమిష్టి కృషికి ఫలితంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మరణాంతరం అవయవాలు దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేసి ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొని నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు.