జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన పెన్షనర్లకు అండగా ఉండాలి

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : “జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి, చివరి దశలో మాకు కనీస న్యాయం చేయండి” ... ఇదే పెన్షనర్ల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, జెఎసి చైర్మన్ చిహెచ్ పురుషోత్తమ నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలసి తమ ఆవేదనను తెలియజేశారు.

వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు అందకుండానే మరణించారని, కనీసం వారసులకు అయినా ఆ బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు ఇచ్చే ప్రాధాన్యం పెన్షనర్లకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

70, 75 సంవత్సరాలు దాటిన వారికి తగ్గించిన 3% క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పూర్వపు శ్లాబ్ ప్రకారం పునరుద్ధరించాలి అని కోరుతూ, “దీని వల్ల ప్రభుత్వానికి నెలకు కేవలం 10 కోట్లు మాత్రమే భారం అవుతుంది” అని లెక్కలు చూపించారు. అలాగే మెడికల్ అలవెన్స్ సీలింగ్‌ను 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని సూచించారు.

ఉద్యోగ సంఘాల మాదిరిగానే “జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని, దానికి ప్రధాన కార్యదర్శినే చైర్మన్‌గా నియమించాలని ప్రతినిధులు ప్రతిపాదించారు. “దసరా కానుకగా ఒక డి.ఎ మంజూరు చేసి, తగ్గించిన పెన్షన్‌ను పునరుద్ధరించాలి” అని కోరారు.

ఈ సమావేశంలో జెఎసి సెక్రటరీ జనరల్ జి. సతీష్ కుమార్, ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ ఉపాధ్యక్షుడు జి. రామస్వామి, జాయింట్ సెక్రటరీ తోట రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

About The Author

Latest News