అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి - ఫ్యాప్టో కర్నూలు జిల్లా
రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రావు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక సమావేశం కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఆర్ సేవా లాల్ నాయక్ అధ్యక్షతన ఎస్టియు భవన్ నందు జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ మరియు కర్నూలు జిల్లా పరిశీలకులుకాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఆర్సి, మధ్యంతర భృతి మంజూరు, సి.పి.ఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఉద్యోగులకు స్నేహ పూరిత ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలోని 12 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించిన పరిస్థితి కానీ, చర్చించిన పరిస్థితి కానీ లేదన్నారు. ప్రభుత్వ పథకాలను, నిర్ణయాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం, సంక్షేమం మాత్రం ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన దాదాపు 30 వేల కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందన లేదన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చర్చించిన పరిస్థితి లేదన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖలో గత నాలుగు సంవత్సరాలుగా మూలుగుతుందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యూటీ, కమ్యూటేషన్, ఈ.ఎల్ ఎన్కాష్మెంట్, అంత్యక్రియల ఖర్చులు తదితర పెన్షన్ సౌలభ్యాలను కూడా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నారు.
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలన్న డిమాండ్ చేయవలసిన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ప్రతి సంవత్సరము 180 కోట్ల రూపాయలు హెల్త్ కార్డుల అమలు కొరకు చెల్లిస్తున్నప్పటికీ హెల్త్ కార్డు పై వైద్యానికి ఏ హాస్పిటల్లో అంగీకరించడం లేదన్నారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. వెంటనే ప్లస్ టూ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పురపాలక ఉపాధ్యాయులకు జిపిఎఫ్ సౌకర్యము, అర్బన్ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. గురుకుల, ఆదర్శ,1998,2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతన స్కేల్ కూడా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వెంటనే ఎంటీఎస్ ను అమలు చేయాలని కోరారు.
ఫ్యాప్టో జిల్లా చైర్మన్ సేవా లాల్ నాయక్ మాట్లాడుతూ కారుణ్య నియామకాలలో జాప్యం వలన మరణించిన ఉద్యోగుల వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. ఏకీకృత సర్వీస్ రూల్స్, జేఎల్ పదోన్నతుల సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకపోవడంతో మూడు దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ, ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో సెక్రటరీ జనరల్ భాస్కర్ మాట్లాడుతూ గతం లో కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇచ్చిన లేఖ పై స్పందించిన కడప ఆర్ జె డి శామ్యూల్ కి ధన్యవాదములు తెలిపారు.
అలాగే కర్నూలు జిల్లా విద్యాధికారి గారు జిల్లా లోని విద్యా శాఖ సమస్య ల పై ఫ్యాప్టో సభ్య సంఘాల తో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అదే విషయం ను నేడు లేఖ ద్వారా జిల్లా విద్యాధికారి గారికి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేయడం జరిగింది అని చెప్పారు.కార్యవర్గ సభ్యులు రవి కుమార్ (యు టి ఎఫ్), నవీన్ పాటిల్ (యు టి ఎఫ్), గోకారి (ఎస్ టి యు), జనార్ధన్ (ఎస్ టి యు), రంగన్న (ఎ పి టి ఎఫ్ 257), ఇస్మాయిల్ (ఎ పి టి ఎఫ్ 1938),మరియానందం(ఎ పి టి ఎఫ్ 1938), మధుసూదన్ రెడ్డి (ఆప్టా) హుస్సేన్(ప్రధానోపాధ్యాయ సంఘం), రోషన్న (డి టి ఎఫ్), నందీశ్వరుడు (బి టి ఎ) శేఖర్ (పి ఈ టి అసోసియేషన్), వెంకటేశ్ (ఎస్ టి టి ఎఫ్)తదితరులు అక్టోబరు 7 వ తేదీన విజయవాడ లో జరిగే ఫ్యాప్టో ధర్నా కార్యక్రమం నకు కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున కదలి వెళ్ళాలి అని సంయుక్తంగా కర్నూలు జిల్లా ఉపాధ్యాయులకు పిలుపు ను ఇచ్చారు.