ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి !
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) :రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లుగా ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. హామీలు పక్కనబెడితే కనీసం ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, ఆయన సహకారంతో ఎన్నికల సమయంలో రాష్ట్రం అంతా తిరిగిన నాయకులను కూడా కలవడంలేదని వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు ఇప్పుడు దిక్కులేనివారిగా మారారని, సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకపోయిందని ఆయన అన్నారు. గతంలో మంత్రుల కమిటీ, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారని, కానీ ఇప్పుడు ఉద్యోగులను ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి మూడేళ్లు పట్టిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే వారిని నిరసనలకు దిగేలా చేసిందని వ్యాఖ్యానించారు.
డాక్టర్లు, గ్రామ–వార్డు సచివాలయ సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు, టీచర్లు అందరూ ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆక్షేపించారు. 16 నెలలుగా ఒక్క డిఎ. ఇవ్వని ప్రభుత్వం ఇదే అని, 4 డి.ఎ లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.“ఈ పండుగ నెలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు చెల్లించలేదు. పెండింగ్ బకాయిలు ఎంత అనేది కూడా ప్రభుత్వం వెల్లడించడం లేదు. ఆర్ధికశాఖ ఆర్టీఐ కింద సమాచారం లేదని సమాధానం ఇచ్చిన స్థాయికి దారితీసింది,” అని కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు.గత ప్రభుత్వం 5 ఏళ్లలో ₹22 వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉంచితే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 16 నెలల్లోనే ₹10 వేల కోట్లు పెంచిందని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో అసెంబ్లీలో చట్టం చేసి 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించగా, 3,400 మందికి మాత్రమే అవకాశం కల్పించారని, మిగిలిన వారిని రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అర్థం కావడం లేదని విమర్శించారు.గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల స్థాయికి దిగజార్చారని, లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు రెండు వారాలుగా ధర్నాలు చేస్తున్నా వారిని పిలిచి మాట్లాడే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు.
“ఉద్యోగులపై టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల వత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఎంపీడీఓల పరిస్థితి దారుణంగా ఉంది. వారి మీద పది మంది పెత్తనం చేస్తుంటే వారికి పని చేసే సమయం ఎక్కడుంది? ఇవన్నీ చాలవన్నట్లు వారితో చెత్త ఫోటోలు తీయిస్తున్నారు. ఇది ఉద్యోగుల అవమానానికి తారకమైంది,” అని ఆయన అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశామని, ఇప్పుడు ఉద్యోగులందరూ ఏకమై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.త్వరలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు