మీ అభిమానం అపూర్వం - నా గుండెల్లో పదిలం
"లీడర్ విత్ కేడర్" కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : "ఇప్పటి వరకు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఈ స్థాయికి తేవడమే కాక పెద్ద ఎత్తున నా జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హదయపూర్వక ధన్యవాదాలు" అని
శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తెలియజేశారు. వినూత్న సేవా కార్యక్రమాలతో వారోత్సవాలు, పుట్టినరోజు నాడు వాడ వాడలా అంబరాన్నంటిన సంబరాలు నిర్వహించిన అందరికీ ఆయన శిరసు వంచి చేతలు జోడించి నమస్కరించారు.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పుట్టినరోజు వేడుకలను స్వచ్ఛందంగా నిర్వహించిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో బృందావన్ గార్డెన్స్‌లోని క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ ఆధ్వర్యంలో శనివారం "లీడర్ విత్ కేడర్" కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, "ఓవైపు అధికారంలో లేము. మరోవైపు అక్రమ కేసులు.. అరెస్టులు.. ఆంక్షలు.. వేధింపులు వెంటాడుతున్నాయి. అయినా అప్పిరెడ్డి మావాడు అంటూ ఆకాశమే హద్దుగా చూపించిన మీ అభిమానానికి కొలతలు లేవు.. కొలమానాలు లేవు.." అని స్పష్టం చేశారు. అవధులు లేని గుంటూరు ప్రజల అభిమానం ఎన్నటికీ మరువలేనిదన్నారు. కులమతాలకు అతీతంగా తనను తమ కుటుంబ సభ్యుడిలా ఆదరించే తీరు అద్భుతమని అభిప్రాయపడ్డారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిదని ఆయన స్పష్టం చేశారు. ఏదో నాలుగు మాటలు చెబితే చాలదని.. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేయడం ద్వారా వారి రుణం కొంతైనా తీర్చుకునేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. అపూర్వం - అపురూపం అయిన ఈ అభిమానాన్ని నా గుండెల్లో పదిలంగా భద్రపరుచుకుంటానని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రకటించారు.
అంకిరెడ్డిపాలెంలోని ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తన పట్ల పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు చూపిన అందరినీ వ్యక్తిగతంగా కలవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు. అధికారంలో ఉంటే నేతల ప్రాపకం కోసమో.. పనుల కోసమో.. వేడుకలు నిర్వహించే వారిని చాలా మందినే చూసి ఉంటారు కానీ.. ఇలా స్వలాభాపేక్ష లేకుండా ఆపేక్ష కురిపించే వారిని సొంతం చేసుకున్న తానెంతో అదృష్టవంతుడినని ఆయన తెలిపారు. మీ కుటుంబ సభ్యుడిలా మీ ప్రతి కష్టసుఖాలలో తోడు-నీడలా నిలబడతానని చెబుతూ.. నా జీవన పయనం మీతోనే అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పరమైన కార్యక్రమం కానప్పటికీ.. మనకి మంచి రోజులు రావాలంటే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న వాస్తవాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ వైయస్ జగన్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా కంకణబద్ధులు కావాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.