కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు

కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు

- ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి 

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) :  కోటి సంతకాలతో కూటమి కోటలు బీటలు వారడం ఖాయమని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహ జ్వాలల్లో ప్రభుత్వం మాడి మసి అవక తప్పదని ఆయన తేల్చి చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ప్రభుత్వ దుర్మార్గపూరితమైన విధానాలకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని లేళ్ళ అప్పిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో రెండే రెండు రకాలు ఉంటాయని తెలిపారు. ఒకటి నమ్మకమైతే రెండోది నయవంచన అని చెప్పారు. నమ్మకానికి ప్రతిరూపం వైయస్ జగన్ అయితే.. నయవంచనకు నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. కనుకనే వైయస్ జగన్ తన హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తెచ్చి పెడితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు వాటిని చంద్రబాబు అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇటు పేద విద్యార్థులు వైద్య విద్యకు, అటు పేద ప్రజలు వైద్యానికి దూరమవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ అనర్ధం జరగకుండా ఉండేందుకే వైయస్ జగన్ ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి పోరుబాట పట్టినట్లు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు. అందులో ప్రధాన భాగమైన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు, "మన కంట నీరు తుడిచే నిజమైన నాయకుడు ఒక్క వైయస్ జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సంతకాల సేకరణ ఉద్యమంలో సంపూర్ణంగా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, గీతా మందిరం ఛైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వినోద్, రీజనల్ కో ఆర్డినేటర్ విఠల్, విద్యార్ధి నేతలు బాజి, రవి, జగదీష్, రాజేష్, అజయ్, కరీం, కిరణ్, సాదిక్, వినేష్, అరుణ్, హోసన్న, ప్రభు, యష్, సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News