మంగళగిరి చిన్నారుల మెరిసే ప్రతిభ... రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ నిర్వహించిన 20వ గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్–2025లో మంగళగిరి చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరిలో మానవ వికాస మండలి ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు.
కోసూరి వెంకట సాంబశివరావు (నాని), శ్రీమతి శ్రావణి దంపతుల పిల్లలు కోసూరి పరిణిక శతాక్షి, కోసూరి చేతన్ ఈ పోటీల్లో మెరవడంతో కుటుంబానికి, మంగళగిరికి గౌరవాన్ని తీసుకువచ్చారు. పరిణిక శతాక్షి ఒక స్వర్ణ, ఒక రజత పతకం, చేతన్ రెండు స్వర్ణ పతకాలు సాధించారు.
జాతీయ స్థాయిలోనూ మెరవాలని ఆకాంక్ష
మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ “చిన్నారులు ఇప్పటితో ఆగిపోకుండా జాతీయ స్థాయిలోనూ విజయం సాధించాలని మనస్సారా కోరుకుంటున్నాం” అన్నారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రుల కృషిని ప్రశంసించారు.
పట్టుదలతో సాధించిన విజయాలు
మంగళగిరి బుద్ధ విహార ట్రస్ట్ కార్యదర్శి పామర్తి రవి, నిర్మల ఫార్మసీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రేఖా నరేష్ బాబు మాట్లాడుతూ, “క్రమశిక్షణ, పట్టుదలతో సాధించిన ఈ విజయాలు మరింత ఉన్నత స్థానాలకు నడిపిస్తాయి” అన్నారు. నవంబర్ మొదటి వారంలో కాకినాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
అభినందనల వర్షం
కార్యక్రమంలో పెదకాకాని దేవాదాయశాఖ ట్రిబ్యునల్ సూపరింటెండెంట్ తలగాని జ్యోతి, మానవతా వేదిక కన్వీనర్ గోలిమధు, దాసరి శ్రీనివాసరావు, వాకాముత్యాలు తదితరులు పాల్గొని చిన్నారులను అభినందించారు.
జ్ఞాపక చిహ్నాల ప్రదానం – కేక్ కటింగ్
విజేతలకు రేఖా కృష్ణార్జునరావు, గోలిమధు ప్రశంసా జ్ఞాపకాలను అందజేశారు. అనంతరం విజేత చిన్నారులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.